తుఫాను హెచ్చరిక: కొత్త అల్పపీడనం ఎఫెక్ట్.. అతి భారీ వర్షాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు, పొడి వాతావరణం కనిపిస్తుంటే.. దక్షిణాదిలో మాత్రం వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సముద్రంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు దక్షిణ భారతదేశాన్ని వాన నీటిలో ముంచెత్తేలా కనిపిస్తున్నాయి.
ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలతో పాటు కేరళ, మాహె జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై కూడా ఈ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడన ముప్పు
దక్షిణాదిలో వర్షాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సముద్రంలో వరుసగా మారుతున్న వాతావరణ పరిస్థితులే. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ , దాని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరింత బలపడే అవకాశం ఉన్న అల్పపీడనం
ఈ కొత్త అల్పపీడనం ఏర్పడిన తర్వాత మరింత బలపడి వాయువ్య దిశగా కదిలే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఇప్పటికే నైరుతి బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో కూడా వాతావరణ వ్యవస్థలు చురుగ్గా ఉన్నాయి. ఈ సీజన్‌లో సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సంభవించే ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావం , అల్పపీడనాల జోరు వల్ల దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
