మరో 4 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ వెదర్ అప్‌డేట్!
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయినప్పటికి, వాతావరణం మాత్రం ఒకేసారి పొడిగా మారే సూచనలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అక్టోబర్ 9న విస్తారంగా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత ప్రాంతాలలో ఈ మార్పు స్పష్టంగా కనిపించనుండగా, ఇది వాతావరణంలో సంభవిస్తున్న ఒక పరివర్తన దశగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
కదులుతున్న రుతుపవనాలు.. ఖాళీ అవుతున్న రాష్ట్రాలు
రాబోయే మూడు నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తర ద్వీపకల్పం, ఈశాన్య భారత్‌లోని మిగిలిన భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి తగ్గేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో పాటుగా ఈ నెల 11న బంగాళాఖాతంలో తుపాను వలయం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అండమాన్ వద్ద మరింత బలపడి వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఫలితంగా తదుపరి నాలుగు రోజుల్లో ఇప్పటికే మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రుతుపవనాలు పూర్తిగా తప్పుకున్నాయి. అయితే రుతుపవనాలు తప్పుకుంటున్నంత మాత్రాన వర్షాలు వెంటనే ఆగిపోవని IMD స్పష్టం చేసింది.

ఉత్తరాదికి హెచ్చరిక: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వీచే వీలుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అక్టోబర్ 14 వరకు తేలికపాటి నుంచి విస్తారంగా జల్లులు పడే అవకాశముంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కూడా వచ్చే రెండు రోజులు వర్ష సూచన ఉంది. దీనికి తోడు ఉత్తర పాకిస్థాన్, దానికి ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల వాయవ్య భారతంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
దక్షిణాదిపై చెక్కుచెదరని వర్ష ప్రభావం
దేశంలోనే అత్యధిక వర్షపాతం అక్టోబర్ 9న దక్షిణాది రాష్ట్రాల్లో నమోదు కానుంది. దక్షిణ ఒడిశా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. కేరళలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు పడటంతో పాటు, తమిళనాడు, కర్ణాటక దక్షణాది జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం వల్ల ఈ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతోంది.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో జల్లులు
బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో అక్టోబర్ 14 వరకు వర్షభరిత వాతావరణం కొనసాగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణంలో హెచ్చుతగ్గులు కొనసాగుతాయి. కాగా, కొంకణ్, గోవా ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్ 10 వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, మొత్తం మీద దేశంలో రుతుపవనాల నిష్క్రమణ పర్వం ఒక వైపు సాగుతుంటే, మరోవైపు అకాల వర్షాలు పలకరిస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది.














Click it and Unblock the Notifications
