పాతాళం నుంచి ప్రయాణం.. వెలుగు చూడని సీక్రెట్
ప్రపంచంలోనే అత్యంత మర్మమైన సముద్ర గర్భంలో సైంటిస్టులకు మైండ్ బ్లాక్ అయ్యే వింత విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాతాళం లాంటి చీకటి లోతుల్లో, అత్యంత భయంకరమైన వేడి, నీటి ఒత్తిడి ఉండే ప్రాంతాల్లో నివసించే వింత జీవులు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతానికి ఎలా విస్తరిస్తున్నాయో ఇప్పటివరకు ఒక మిస్టరీగా ఉండేది. అయితే, టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన తాజా అన్వేషణలో ఈ వింత జీవుల లైఫ్ సర్కిల్‌కు సంబంధించి ఊహించని సంచలన నిజాలు బయటపడ్డాయి.
సముద్రం అడుగున ఉండే వేడి నీటి బుగ్గల (హైడ్రోథర్మల్ వెంట్స్) వద్ద నివసించే చిన్న తరహా గవ్వలు, నత్తలు తమ చిన్నతనంలో ఏకంగా సముద్ర ఉపరితలానికి ఈదుకుంటూ వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లోతైన చీకటి ప్రపంచం నుంచి ఉపరితలానికి చేరుకుని, అక్కడ సూర్యకాంతిలో పెరిగే సూక్ష్మజీవులను తింటూ ఇవి పెరుగుతాయి. అలా సముద్ర పైపొరల్లో ప్రయాణిస్తూ, పైభాగంలో కొట్టుకుపోయే బలమైన నీటి ప్రవాహాల సాయంతో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఆ తర్వాత మళ్లీ సముద్ర గర్భంలోకి తిరిగి వెళ్ళి తమ కొత్త నివాసాలను ఏర్పరుచుకుంటున్నాయి.

చిన్న గవ్వపై దొరికిన చారిత్రక ఆధారాలు!
పెద్దగా ఎదిగిన నత్తల ఒంటిపై ఉండే చిన్ని శంఖాల రసాయన ఆనవాళ్లను పరిశీలించినప్పుడు ఈ రహస్య ప్రయాణం గుట్టు విప్పే కీలక ఆధారాలు లభించాయి. వాటి పొరల్లో సముద్ర ఉపరితలం వద్ద ఉండే వెచ్చని నీటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. పైగా సముద్రపు అడుగున ఉండే వేడి నీటిలో కనిపించే మ్యాంగనీస్, బేరియం లాంటి భారీ లోహాల ఆనవాళ్లు ఈ చిన్న పొరల్లో అస్సలు లేవు. దీనిబట్టి ఇవి తమ చిన్నతనంలో నీటి పైభాగంలోనే పెరిగాయని పరిశోధకులు కచ్చితమైన ముగింపునకు వచ్చారు.
కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం!
ఈ ప్రయాణం అనుకున్నంత తేలికైనది కాదు. సముద్ర గర్భం నుంచి పైకి వచ్చి, మళ్లీ సుదూరాన ఉన్న వేరొక వేడి నీటి బుగ్గను చేరుకోవడం అత్యంత ప్రమాదకరమైన సాహసం. మార్గమధ్యంలో అత్యధిక శాతం లార్వాలు వేరే పెద్ద జీవులకు ఆహారంగా మారిపోతాయి లేదా దారి తప్పిపోతాయి. ఈ ప్రమాదాన్ని తట్టుకుని ఏదో ఒక లార్వా సురక్షితంగా సరైన స్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే, ఈ జీవులు ఒకేసారి కోట్లాది సంఖ్యలో గుడ్లను పెడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వెలుగు ప్రపంచానికి, చీకటి పాతాళానికి బలమైన బంధం!
ఇప్పటివరకు సముద్ర గర్భంలోని వ్యవస్థలు, పైన ఉండే సూర్యకాంతి ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా మనుగడ సాగిస్తాయని భావించేవారు. కానీ ఈ తాజా పరిశోధనతో పాతాళంలో ఉండే జీవుల అభివృద్ధికి, సూర్యకాంతి ఆధారంగా బతికే సముద్ర ఉపరితల వ్యవస్థకు ఎంత బలమైన అనుబంధం ఉందో స్పష్టమైంది. ఈ రకమైన ప్రయాణ వ్యూహం ఒక్క నత్తలకే కాకుండా, సముద్రపు లోతుల్లో ఉండే రొయ్యలు, నత్త జాతి జీవులకు కూడా వర్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications