తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!
తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మూడు రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణలోని ప్రాంతాల్లోనే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోందని ఈ అల్పపీడనం తన దిశను ఏపీ- ఒడిశా తీరాలకు మార్చుకునే అవకాశం ఉండటంతో తెలంగాణపైనా దాని ప్రభావం పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఐఎండీ బులెటిన్ ను విడుదల చేసింది.

ఐఎండీ వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతోపాటు మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘామృతమై ఉటుందని అలాగే నగరంలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు నగరవాసులు అందుకు తగినట్లుగా ప్రయాణాలు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
