ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!
ఏపీలో డీఎస్సీ అక్రమాల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఇప్పటికే డీఎస్సీ వివాదంపై వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తుండటం, దానికి ప్రభుత్వం అధికారులతో కౌంటర్లు ఇప్పించడం, సంతృప్తి చెందని వైఎస్సార్సీపీ మళ్లీ కొత్త ఆరోపణలు చేయడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో శాప్ కార్యాలయ ముట్టడికి వైసీపీ వెళ్లడం, టీడీపీ క్యాడర్ తో దాన్ని అడ్డుకోవడం, ఈ సందర్భంగా పోలీసులు కేసులు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ (YS Jagan) దీనిపై మరోసారి ఘాటుగా ట్వీట్ పెట్టారు.
డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? అంటూ సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి అన్నారు. విజయవాడలో ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోందన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? అని ప్రశ్నించారు.

.@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది?… pic.twitter.com/oOWsewQMA3
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2026
డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే, మీ బుద్ధే అంత అన్నారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ కోరుతున్నామని, ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు అని అడిగారు. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరన్నారు.














Click it and Unblock the Notifications
