DNA: ప్రపంచమే షాక్ అయ్యే ప్రయోగం! మగ ఎలుక నుంచి ఆడ ఎలుక పుట్టింది..
జన్యుశాస్త్ర పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించారు. చరిత్రలోనే తొలిసారిగా ఒక మగ ఎలుక శరీరం నుంచి తీసుకున్న కణాల ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న 'ఆడ' క్లోన్ ఎలుకలను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. జపాన్‌లోని ప్రసిద్ధ 'రికెన్ బయోరిసోర్స్ రీసెర్చ్ సెంటర్', 'యామనాషి యూనివర్సిటీ' పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రయోగం, అంతరించిపోతున్న అరుదైన జంతుజాలాన్ని కాపాడుకోవడానికి ఒక కొత్త బాటలు వేసింది.
సాధారణంగా మగ జీవుల్లో XY క్రోమోజోమ్‌లు ఉంటాయి. శాస్త్రవేత్తలు 'క్రిస్పర్' అనే అత్యాధునిక జన్యు సవరణ సాంకేతికతలో 'Y-CUT' పద్ధతిని ఉపయోగించి, మగ ఎలుక కణాల్లోని 'Y' క్రోమోజోమ్‌ను తొలగించారు. దీనికి 'డ్యూయల్-సెక్స్ క్లోనింగ్' అని పేరు పెట్టారు. ఇలా తయారైన పిండాలను సరోగేట్ (తల్లి) ఎలుకల్లో ప్రవేశపెట్టగా, వై-క్రోమోజోమ్ లేని (XO) ఆరోగ్యకరమైన ఆడ ఎలుక పిల్లలు జన్మించాయి. మగ జీవి కణాల నుంచి ఒక ఆడ జీవికి జన్మనివ్వడం సైన్స్ ప్రపంచంలో ఊహించని పరిణామం.

అంతరించిపోయే జీవులకు కొండంత ఆసరా
కాలానుగుణంగా భూమిపై అనేక జంతు జాతులు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక జాతిలో కేవలం మగ జీవులు మాత్రమే మిగిలిపోయి, ఆడ జీవులు లేక సంతానోత్పత్తి ఆగిపోయిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో, శాస్త్రవేత్తలు భద్రపరిచిన మగ జీవుల కణజాలం ఆధారంగా ఈ సాంకేతికతతో ఆడ జీవులను సృష్టించవచ్చు. ఉదాహరణకు 'నార్తర్న్ వైట్ రైనో' వంటి అత్యంత అరుదైన జీవులను కాపాడుకోవడానికి ఈ పద్ధతి అద్భుతంగా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భవిష్యత్తు సవాళ్లు: నిపుణుల అభిప్రాయం
గతంలో కూడా మగ ఎలుకల నుంచి అనుకోకుండా Y-క్రోమోజోమ్ పోయి ఆడ ఎలుకలు పుట్టిన ఘటనలు ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు కావాలని ప్రణాళికాబద్ధంగా ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ఇదే తొలిసారి. అయితే, ఈ పద్ధతిలో సృష్టించిన పిండాల్లో తక్కువ శాతమే పూర్తిస్థాయిలో పెరిగి పిల్లలుగా మారుతుండటంతో దీని విజయావకాశాల శాతాన్ని మరింత పెంచాల్సి ఉంది. అంతేకాకుండా, గుర్రాలు, మానవులలో Y-క్రోమోజోమ్ లోపిస్తే సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని, కాబట్టి ఇతర జంతువులపై ఇది ఎంతవరకు పనిచేస్తుందనే దానిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications