ఈ టౌన్ లో 65 రోజుల పాటు చీకటి రాత్రులు: చిట్టచివరి సూర్యాస్తమయం
అలస్కాలోని ఉట్కియాగ్విక్ టౌన్ లో ఓ అరుదైన భౌగోళిక మార్పునకు వేదికగా నిలిచింది. ప్రతి ఏటా శీతాకాలంలో సంభవించే సుదీర్ఘమైన పోలార్ నైట్ ఇక్కడ ప్రారంభమైంది. అక్కడ సూర్యుడు అస్తమించాడు. మళ్లీ సూర్యుడు ఉదయించేది అక్షరాలా 65 రోజుల తర్వాతే. ఈ టౌన్ లో సూర్యోదయం అనేది ఇక ఇప్పట్లో కనిపించదు. దాదాపు రెండు నెలలకు పైగా ఈ పట్టణం సూర్యకాంతి రహిత వాతావరణంలోనే తమ దైనందిన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది.
అక్కడి కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:42 నిమిషాలకు ఉట్కియాగ్విక్ టౌన్ లో సూర్యోదయమైంది. సరిగ్గా గంట తర్వాత సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాదికి అక్కడి ప్రజలకు ఇదే చిట్టచివరి సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా. ఇక మళ్లీ అక్కడ జనవరి 22 లేదా 23 తేదీల్లో మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. దాదాపుగా 65 రోజుల పాటు ఈ చిన్న పట్టణం చీకట్లోనే గడుపుతుంది. సూర్యకిరణాలనేవి అక్కడ కనిపించవు.

భూగోళానికి చిట్టచివర ఉండే ఈ ఉట్కియాగ్విక్ టౌన్ లో దాదాపు 4,400 మంది జనాభా నివసిస్తోన్నారు. గతంలో దీన్ని బారో గా పిలిచేవారు. ఆర్కిటిక్ మహాసముద్ర తీరంలో, చుక్కి, బ్యూఫోర్ట్ సముద్రాలు కలిసే ప్రాంతంలో ఉండే ఈ టౌన్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లలేం. ఫెయిర్‌బ్యాంక్స్, యాంకరేజ్ వంటి నగరాల నుంచి విమాన మారర్గంలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉండే భౌగోళిక ప్రాంతాల్లో ప్రతి ఏటా శీతాకాలంలో ఈ తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడటం సర్వసాధారణం. దీనికి శాస్త్రీయ కారణాలు లేకపోలేదు. భూమి తన భ్రమణ అక్షం చుట్టూ 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే ఈ విచిత్రమైన సూర్యకాంతి రహిత వాతావరణానికి ప్రధాన కారణం. శీతాకాలంలో ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఒంగి ఉండటం వల్ల ఆర్కిటిక్ సర్కిల్ కు నేరుగా సూర్యరశ్మి సోకదు.
దీనినే శాస్త్రీయ పరిభాషలో 'పోలార్ నైట్' అని పిలుస్తారు. దీనివల్ల ఉత్తర ధృవానికి సమీపంలో ఉండే అనేక నివాస ప్రాంతాలు సుదీర్ఘకాలం పాటు రాత్రి వాతావరణంలోనే ఉండిపోతాయి. సూర్యుడు ఉదయించకపోవడం అంటే రోజంతా కటిక చీకటిగా ఉంటుందని భావించాల్సిన అవసరం లేదు. పోలార్ నైట్ సమయంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు సివిల్ ట్విలైట్ అని పిలిచే సంధ్యా వెలుతురు కనిపిస్తుంది. సూర్యుడు క్షితిజ రేఖకు కాస్త దిగువన ఉన్నప్పుడు ఈ మసక వెలుగు ఏర్పడుతుంది.
ఇది స్థానికులకు వెలుతురు కొరతను కొంతవరకు భర్తీ చేస్తుంది. తమ రోజువారీ పనులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సుదీర్ఘ చీకటి రోజులు ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాలు ఆగిపోవు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, ఉద్యోగులు విధులకు హాజరుకావడం యథాతథంగా సాగుతాయి. సున్నా డిగ్రీల కంటే చాలా తక్కువకు పడిపోయే తీవ్రమైన చలి నుంచి తట్టుకోవడానికి, సూర్యకాంతి లేకపోవడం వల్ల కలిగే పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు లైటింగ్, విటమిన్ డీ సప్లిమెంట్లు, ఇళ్లలోని హీటింగ్ వ్యవస్థలపై ఆధారపడతారు.
ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత మైనస్ లో ఉంది. -6 గా రికార్డయింది. ఈ సుదీర్ఘమైన చీకటి రాత్రులు స్థానికులకు, సందర్శకులకు ఓ అద్భుత ప్రకృతి దృశ్యాన్ని తిలకించే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాత్రిపూట ఆకాశంలో విరబూసే అరోరా బొరియాలిస్ (నార్తర్న్ లైట్స్) ను చూడటానికి ఇది అత్యంత అనువైన సమయం. చీకటి నేపథ్యంలో ఆకాశంలో ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్ వంటి అనేక రంగుల్లో మెరిసే ఈ నార్తర్ లైట్స్.. ఈ మంచు ప్రాంతానికి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొస్తాయి.
శీతాకాలంలో రెండు నెలలకు పైగా చీకట్లో మునిగిపోయే ఈ ఉట్కియాగ్విక్ పట్టణం.. వేసవి కాలంలో దీనికి పూర్తి విరుద్ధమైన వాతావరణాన్ని చవి చూస్తుంటుంది.. మే నుంచి ఆగస్టు వరకు దాదాపు 84 రోజుల పాటు ఇక్కడ అసలు సూర్యాస్తమయమే ఉండదు. చీకటి అనేది పడదు. 24 గంటలూ సూర్యకాంతి ప్రసరిస్తూనే ఉంటుంది. దీన్ని మిడ్‌నైట్ సన్, పోలార్ డే అని వ్యవహరిస్తారు. సుదీర్ఘ శీతాకాలంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిటీ వేడుకలు, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ఇక్కడి జనం.














Click it and Unblock the Notifications
