సంపూర్ణ చంద్ర గ్రహణం- అసలే హోలీ..!!
Lunar eclipse 2025: ఈ నెల 13- 14 తేదీల్లో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది కన్యారాశిలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. 14వ తేదీ నాడే హోలీ పౌర్ణమి కూడా కావడం- దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం- తెల్లవారు జామున 2:26 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 3:31 నిమిషాలకు ముగుస్తుంది. సుమారు 65 నిమిషాల పాటు భూమి ఛత్ర ఛాయలోకి వెళ్లిపోతుంది చందమామ. ఈ సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. మార్చి నెలలో ఏర్పడబోతోన్నందున ఈ చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్‌గా పిలుస్తారు.

ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించగలుగుతారు. అలాగే- యూరప్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తుంది.
అలస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఈ చంద్ర గ్రహణాన్ని స్పష్టంగా చూడొచ్చు. దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీల్లో ఇది కనిపిస్తుంది. పశ్చిమ యూరప్ రీజియన్‌లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలోని కేప్ వెర్డె, మొరాకో, సెనెగల్.. దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కనువిందు చేస్తుంది.
సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్ర గ్రహణంగా పిలుస్తారనే విషయం తెలిసిందే. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది.
చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణకాలంలో నేరుగా చంద్రుడిని చూడొచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. ఈ గ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.












Click it and Unblock the Notifications