పాలపుంతలో అంతుచిక్కని మిస్టరీ.. ప్రతి 62 నిమిషాలకు వింత శబ్ధం
అంతరిక్ష లోతుల్లో శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మన మిల్కీ వే గెలాక్సీలో ఒక వింత ఖగోళ వస్తువు నుంచి బలమైన రేడియో సంకేతాలు వెలువడుతున్నాయి. సరిగ్గా ప్రతి 62.2 నిమిషాలకు ఒకసారి ఈ సిగ్నల్స్ పంపిస్తున్న ఆ వస్తువు.. ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమైపోతుండటం ఖగోళ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఈ సరికొత్త ఆవిష్కరణతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటి మరో పాత రహస్యానికి సంబంధించిన చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
'ఎల్‌పీటీ జెడ్ 1555-5631' గుట్టు విప్పే పనిలో సైంటిస్టులు
స్వీట్ బ్రియార్ కాలేజీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్కాట్ హైమన్ నేతృత్వంలోని పరిశోధక బృందం.. సౌతాఫ్రికాకు చెందిన 'మీర్‌క్యాట్' రేడియో టెలిస్కోప్ పాత డేటాను పరిశీలిస్తుండగా ఈ వింత వస్తువును గుర్తించారు. 2022 మే నెలలో సుమారు 15 గంటల పాటు ఈ సిగ్నల్స్ చాలా స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన 'అస్క్యాప్' టెలిస్కోప్ ద్వారా కూడా ఇదే ప్రాంతాన్ని పరిశీలించి ఈ పునరావృత నమూనాను నిర్ధారించారు. అయితే, గత ఐదేళ్ల కాలంలో ఎన్నోసార్లు గమనించినప్పటికీ మళ్లీ ఎటువంటి సంకేతాలు రాలేదు. దీన్ని 'లాంగ్-పీరియడ్ ట్రాన్సియెంట్స్' (ఎల్‌పీటీ) అనే అత్యంత అరుదైన ఖగోళ వస్తువుల కోవలో చేర్చారు.

ప్రతి గంటలో రెండు వింత పల్సులు.. అయిస్కాంత క్షేత్రంలో సంక్లిష్టత
ఈ వస్తువు ప్రదర్శిస్తున్న తీరు మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతి 62 నిమిషాల చక్రంలో ఇది రెండు వేర్వేరు రేడియో పల్స్‌లను విడుదల చేస్తోంది. ఈ రెండు సిగ్నల్స్ దాదాపు ఒకేలా ప్రకాశిస్తున్నప్పటికీ, వాటి కాలపరిమితి వేర్వేరుగా ఉండటంతో పాటు వ్యతిరేక దిశలలో సర్క్యులర్ పోలరైజేషన్ కలిగి ఉన్నాయి. అంటే రేడియో తరంగాలు వ్యతిరేక దిశలలో మెలికలు తిరిగి వస్తున్నాయన్నమాట. ఈ సిగ్నల్స్ ఆ వస్తువుకు ఉండే రెండు వేర్వేరు అయిస్కాంత ధృవాల నుంచి వెలువడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా ఉండాల్సిన 180 డిగ్రీలకు బదులుగా 165.4 డిగ్రీల దూరంలో ఇవి వేరుపడి ఉండటం అక్కడ ఏదో సంక్లిష్టమైన అయిస్కాంత వాతావరణం ఉందని చెబుతోంది.
2002 నాటి పాత మిస్టరీని తలపిస్తున్న తాజా ఘటన
ఈ సరికొత్త ఆవిష్కరణతో 2002 సంవత్సరంలో జరిగిన ఒక వింత సంఘటన చర్చనీయాంశమైంది. అప్పట్లో సెప్టెంబర్ నెలలో పాలపుంత కేంద్రం సమీపంలో ఇదే శాస్త్రవేత్త హైమన్ 'జీసీఆర్‌టీ జెడ్ 1745-3009' అనే మరో రేడియో వస్తువును గుర్తించారు. అది సరిగ్గా 77 నిమిషాల వ్యవధిలో ఐదు శక్తివంతమైన రేడియో విస్ఫోటనాలను (ఫ్లేర్స్) వెలువరించి ఆ తర్వాత శాశ్వతంగా మూగబోయింది. ఆ తర్వాత 2003లో మరోసారి ఒకే ఒక్క సిగ్నల్ కనిపించినా, ఆ తర్వాత దాని జాడ దొరకలేదు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన వస్తువు కూడా అలాగే ప్రవర్తించడం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది.
అసలు ఈ సిగ్నల్స్ వెనుక ఉన్న శక్తులు ఏమిటి?
ఈ వింత సిగ్నల్స్‌ను అసలు ఏది ఉత్పత్తి చేస్తోంది అనే దానిపై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఇవి నెమ్మదిగా భ్రమణం చెందే న్యూట్రాన్ నక్షత్రాలు కావచ్చని, లేదా అత్యంత శక్తివంతమైన అయిస్కాంతాలు ఉండే మాగ్నెటార్లు, లేదా వైట్ డ్వార్ఫ్స్ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో ఏ ఒక్క అంచనా కూడా ఈ వింత ప్రవర్తనను పూర్తిగా వివరించలేకపోతోంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఖగోళ వస్తువులను కనుగొనగలిగితేనే ఈ విశ్వ రహస్యాల వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడతాయని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.














Click it and Unblock the Notifications
