TB: వందల ఏళ్ల పాత టీకాకు బై-బై? 73 లక్షల మంది ప్రాణాలు బ్లాక్ బస్టర్ వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న అత్యంత ప్రమాదకరమైన 'టీబీ' (క్షయ) వ్యాధికి త్వరలోనే బలమైన చెక్ పడబోతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ 2029 నాటికి సరికొత్త రకం టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి గనక మార్కెట్లోకి వస్తే 2030 నుంచి 2050 మధ్య కాలంలో ఏకంగా 73 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని వ్యాక్సిన్ అలయన్స్ 'గావి' (Gavi) వెల్లడించింది. అంతేకాకుండా, దీనివల్ల పేద, మధ్యతరగతి దేశాలకు సుమారు 135 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేసింది.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బీసీజీ (BCG) వ్యాక్సిన్‌ను కనుగొని వందేళ్లకు పైగా దాటిపోయింది. ఇది కేవలం చిన్న పిల్లలకు, నవజాత శిశువులకు మాత్రమే కొంతవరకు రక్షణ ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ టీకా ఇచ్చే రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. దీనివల్ల యుక్తవయస్కులు, పెద్దల్లో ఊపిరితిత్తుల క్షయవ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఈ కొత్త తరం వ్యాక్సిన్‌లను ప్రత్యేకంగా యువత, పెద్దలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. ఇది వైద్య రంగంలోనే ఒక అతిపెద్ద విప్లవంగా మారబోతోందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పేద దేశాలకే అత్యంత అవసరం!
గావి సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా టీబీ బాధితుల్లో ఎక్కువ భాగం పేద, నిరుపేద దేశాల్లోనే ఉన్నారు. టీబీ మరణాల్లో ఏకంగా 77 శాతం మరణాలు ఈ దేశాల్లోనే నమోదు కావడం విషాదకరం. అయితే ఈ కొత్త టీకాలు అందుబాటులోకి వచ్చాక, వాటిని కేవలం ధనిక దేశాలకే పరిమితం చేయకుండా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాలకు త్వరితగతిన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని గావి సీఈఓ సానియా నిష్తార్ స్పష్టం చేశారు. పేద దేశాల్లో ఏటా సగటున 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసుల అవసరం ఉంటుందని అంచనా వేశారు.
అందరికీ అందాలంటే ఈ సవాళ్లు దాటాల్సిందే!
కొత్త టీకాలు రూపుదిద్దుకుంటున్నప్పటికీ, అవి మార్కెట్లోకి వచ్చాక సామాన్యుడికి అందుబాటులోకి రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. టీకాల ఉత్పత్తి పరిమితులు, సరిపడా నిధులు లేకపోవడం, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు రాకుండా ముందస్తుగా ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యాక్సిన్ ధరలు అందుబాటులో ఉండేలా చూడటం, తయారీని కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన సంస్థలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా కొరత లేకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ముందే సిద్ధమవుతున్న తీవ్ర ప్రభావిత దేశాలు
గావి మార్గదర్శకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు తీవ్ర ప్రభావిత దేశాలు ఈ కొత్త టీకాను స్వీకరించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సాధారణ వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో పాటు, అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఈ టీకాలను అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే ఐదేళ్లలో టీబీ రహిత ప్రపంచాన్ని చూడటంలో ఈ 'బ్లాక్‌బస్టర్' వ్యాక్సిన్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.














Click it and Unblock the Notifications
