ప్రపంచాన్ని కాపాడబోతున్న ఏఐ టీకా! వైద్య శాస్త్రంలో అద్భుతం..
ప్రపంచాన్ని వణికించే భవిష్యత్తు మహమ్మారులను ముందే తుదముట్టించే దిశగా వైద్య శాస్త్రం ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఏ కరోనా వైరస్ వేరియంట్ వచ్చినా తట్టుకునేలా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, డీఐఓఎస్-ఇన్-వాక్స్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'యూనివర్సల్ కరోనావైరస్' ప్రయోగాత్మక వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. 39 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై జరిపిన ఈ పరీక్షల్లో టీకా అత్యంత సురక్షితమైనదని తేలింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేస్తూ ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక 'జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్' ఈ వివరాలను ప్రచురించింది.
వైద్య చరిత్రలో తొలిసారిగా పూర్తిగా కంప్యూటర్ సిమ్యులేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'సార్బెకో' కరోనావైరస్ కుటుంబానికి చెందిన వందలాది వైరస్‌ల జన్యు సమాచారాన్ని (డేటా) విశ్లేషించి, శాస్త్రవేత్తలు ఒక శక్తివంతమైన 'సూపర్-యాంటిజెన్'ను డిజైన్ చేశారు. కోవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2 తో పాటు, గతంలో వచ్చిన సార్స్, భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదమున్న గబ్బిలాల ద్వారా వచ్చిన కరోనా వైరస్‌లను సైతం ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

వైరస్ వెంట పడే పద్ధతికి స్వస్తి!
"ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వైరస్ రూపం మారాక అందుకనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి వస్తోంది. కానీ, మేము వైరస్ వెనకాల పరుగులు తీసే పాత పద్ధతిని మార్చేశాం. వైరస్ భవిష్యత్తులో ఎలా మ్యుటేషన్ చెందినప్పటికీ, ఈ 'ఫ్యూచర్-ప్రూఫ్' వ్యాక్సిన్ దాని నుంచి శాశ్వత రక్షణ కల్పిస్తుంది." - ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, ప్రాజెక్ట్ లీడ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.
సూది లేని ఇంజెక్షన్.. వేగవంతమైన ప్రక్రియ
సౌతాంప్టన్, కేంబ్రిడ్జ్‌లోని ఎన్‌హెచ్‌ఆర్ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీస్‌లో 18 నుంచి 50 ఏళ్ల వయసు గల వారికి ఈ టీకా ఇచ్చారు. దీనికి యూనివర్శిటీ హాస్పిటల్ సౌతాంప్టన్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ ట్రయల్స్‌లో మరో కీలక మైలురాయి ఏంటంటే... ఎలాంటి సూది (ఇంజెక్షన్) వాడకుండా 'మైక్రో ఫ్లూయిడ్ జెట్ సిస్టమ్' ద్వారా వ్యాక్సిన్‌ను నేరుగా శరీరంలోకి పంపారు. సూదులంటే భయపడే వారికి ఇది ఎంతో ప్రత్యామ్నాయంగా నిలవనుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగపడనుంది.
ముందస్తు రక్షణతో ప్రాణాల రక్షణ
ట్రయల్స్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సావూల్ ఫాస్ట్, ఎన్‌హెచ్‌ఆర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మారియన్ నైట్ ఈ ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు. మహమ్మారి వ్యాప్తి చెందకముందే ఇలాంటి ముందస్తు వ్యాక్సిన్లను సిద్ధం చేసుకోవడం ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని వారు తెలిపారు. జంతువులపై ప్రయోగాల్లోనూ అద్భుతమైన ఇమ్యూనిటీని చూపించిన ఈ వ్యాక్సిన్‌ను, తదుపరి దశలో భాగంగా పెద్ద సంఖ్యలో ప్రజలపై 'ఫేజ్-2' క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పరిశోధకులు సన్నాహాలు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications