అస్థిపంజరానికి వేలంపాట.. 12 నిమిషాల్లో 450 కోట్లు! ప్రపంచంలోనే మూడో స్కెలిటన్
కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై స్వైరవిహారం చేసిన ఒక అరుదైన డైనోసార్ అస్థిపంజరం వేలంలో ఊహించని రీతిలో రికార్డు ధర పలికింది. అగ్రరాజ్యం న్యూయార్క్లో నిర్వహించిన సోత్బైస్ (Sotheby's) వేలంలో టీ-రెక్స్ (T. rex) జాతికి చెందిన చిన్న సైజు ప్రతిరూపంగా భావించే 'నానోటైరన్నస్' (Nanotyrannus) అస్థిపంజరం ఏకంగా 4.73 కోట్ల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 450,02,18,965 పైగా) అమ్ముడుపోయింది. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ఆరుగురు దిగ్గజ కొనుగోలుదారుల మధ్య జరిగిన హోరాహోరీ పోటీ ఈ అరుదైన ఫాసిల్ విలువను ఆకాశానికి ఎత్తివేసింది.
ప్రపంచంలోనే మూడో అస్థిపంజరం..
'జోడి'గా నామకరణం చేసిన ఈ నానోటైరన్నస్ అస్థిపంజరం ప్రపంచంలోనే లభించిన మూడో పూర్తి స్థాయి నానోటైరన్నస్ ఫాసిల్గా నిలిచింది. ప్రారంభంలో దీని విలువ సుమారు 6 నుంచి 9 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ, ఊహించని రీతిలో ధర పలుకుతూ గతంలో ఒక టీ-రెక్స్ అస్థిపంజరం సాధించిన 50.1 మిలియన్ డాలర్ల రికార్డుకు సమీపంలోకి వెళ్లింది. దాదాపు 9.6 అడుగుల ఎత్తు, 19.6 అడుగుల పొడవు ఉన్న ఈ ఫాసిల్లో 191కి పైగా ఎముక భాగాలు, అత్యంత సురక్షితంగా ఉన్న పుర్రె భాగం నిక్షిప్తమై ఉన్నాయి.

శాస్త్రవేత్తల్లో తీవ్ర చర్చ.. టీ-రెక్స్ కాదా?
నానోటైరన్నస్ అనేది అసలు వేరే డైనోసార్ జాతా లేక టీ-రెక్స్ చిన్న పిల్లల అస్థిపంజరమా అనే విషయంపై చాలా కాలంగా పురాతత్వ శాస్త్రవేత్తలలో తీవ్రమైన వివాదం నడుస్తోంది. కానీ, ఇటీవల వెలువడుతున్న పరిశోధనల ప్రకారం ఇది టీ-రెక్స్ కంటే భిన్నమైన ప్రత్యేక జాతికి చెందిన డైనోసార్ అని పరిశోధకులు నిర్ధారణకు వస్తున్నారు. 'జోడి' ఎముకల పరిమాణం, ఎదుగుదలను బట్టి ఇది పూర్తి స్థాయిలో పెరిగిన ఒక వయోజన డైనోసార్ అస్థిపంజరమని నిపుణులు ధృవీకరించారు.
డైనోసార్ కౌబాయ్ శోధన.. అమెరికాలో లభించిన నిధి!
ఈ అరుదైన అస్థిపంజరాన్ని 2019లో మోంటానాకు చెందిన 'జోడి పియర్సన్' అనే మహిళ గుర్తిస్తే, 'డైనోసార్ కౌబాయ్' అని పిలిచే ప్రొఫెషనల్ పాలియోంటాలజిస్ట్ క్లేటన్ ఫిప్స్ భూమి లోపల నుంచి తవ్వి తీశారు. అమెరికాలోని మోంటానా, వ్యోమింగ్ పరిధిలో విస్తరించి ఉన్న ప్రసిద్ధ 'హెల్ క్రీక్' ప్రాంతంలో ఇది లభ్యమైంది. ప్రపంచంలోనే మొదటి టీ-రెక్స్ అస్థిపంజరం లభించిన ఈ ప్రాంతంలోనే ఈ కొత్త నిధి దొరకడం విశేషం.
బిజినెస్ హక్కులతో సొంతం చేసుకుంది ఎవరు?
వేలంలో లభ్యమైన కొన్ని ఎముక భాగాలను 3D ప్రింటింగ్, ఆర్టిస్టిక్ శిల్పాలతో పూర్తిస్థాయి ఆకారంలోకి తీసుకొచ్చారు. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ వేలం ద్వారా అస్థిపంజరాన్ని గెలుచుకున్న యజమానికి దీనిపై పూర్తి కాపీరైట్ హక్కులు దక్కాయి. అంటే, ఆ కొత్త యజమాని ఈ అస్థిపంజరం యొక్క 3D మోడళ్లను తయారు చేసి ఇతర మ్యూజియంలకు లేదా కలెక్టర్లకు విక్రయించుకునే పూర్తి వెసులుబాటు ఉంది. అయితే, వందల కోట్లు వెచ్చించి దీనిని సొంతం చేసుకున్న ఆ కొత్త యజమాని పేరును వేలం సంస్థ గోప్యంగా ఉంచడం గమనార్హం.














Click it and Unblock the Notifications
