జూలై 17న ఆకాశంలో మునుపెన్నడూ చూడని వింత దృశ్యం!
అంతరిక్ష ప్రియులను, నక్షత్ర వీక్షకులను అలరించే మరో అద్భుత ఖగోళ దృశ్యం ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. సౌర కుటుంబంలోని ఆరు గ్రహాలు (బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్) ఒకే వరుస క్రమంలోకి రానున్నాయి. జూలై 17వ తేదీన ఈ 'ప్లానెట్ అలైన్‌మెంట్' (గ్రహాల అమరిక) స్పష్టంగా కనిపించనుందని అంతర్జాతీయ ఖగోళ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది 'జీవితంలో ఒకే ఒక్కసారి చూసే అద్భుతం' (Show of our lifetime) ఏమీ కాదని, ఇలాంటి అమరికలు ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు సహజంగానే జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఏయే ప్రాంతాల వారికి కనిపిస్తుంది?
ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక భౌగోళిక పరిమితులు లేవు. ఆకాశం మేఘాలు లేకుండా, స్పష్టంగా ఉంటే.. భారతదేశంతో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ప్రజలు ఈ గ్రహాల అమరికను చూడవచ్చు. అయితే నగరాల్లో ఉండే విపరీతమైన కాంతి కాలుష్యం (Light Pollution), ఎత్తైన భవనాల వల్ల గ్రహాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. కాబట్టి, నగర శివార్లకు లేదా ఎలాంటి లైట్ల వెలుతురు లేని మైదానాలు, భవనాల పైకప్పుల నుంచి చూస్తే ఈ దృశ్యం బాగా కనిపిస్తుంది.

చూడాల్సిన సమయం ఇదే..
ఖగోళ నిపుణుల ప్రకారం.. ఈ ఆరు గ్రహాల విన్యాసాన్ని చూడటానికి జూలై 17న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు వరకు అత్యంత అనుకూలమైన సమయం.
- శని, గురు, అంగారక గ్రహాలు: ఇవి అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకాశంలో కాస్త ఎత్తులో ప్రకాశిస్తూ మనిషి కంటికి స్పష్టంగా కనిపిస్తాయి.
- బుధ, శుక్ర గ్రహాలు: ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల, కేవలం సూర్యోదయానికి సరిగ్గా అరగంట లేదా గంట ముందు మాత్రమే తూర్పు దిశలో ఆకాశం అంచున (Horizon) కనిపిస్తాయి. సూర్యుడు పైకి వచ్చే కొద్దీ ఆ వెలుతురులో ఇవి కలిసిపోతాయి.
అన్నీ కంటికి కనిపిస్తాయా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
సోషల్ మీడియాలో ఆరు గ్రహాలూ కంటికి నేరుగా కనిపిస్తాయని జరుగుతున్న ప్రచారంలో పూర్తిగా నిజం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గురుడు(Jupiter), శని(Saturn), అంగారకుడు(Mars), శుక్రుడు(Venus) గ్రహాలను మాత్రమే మనం సాధారణ కంటితో గుర్తించగలం. కానీ, సూర్యుడి కాంతి కారణంగా బుధుడిని (Mercury) చూడటం కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఇక ఆరో గ్రహమైన యురేనస్ (Uranus) భూమికి అత్యంత దూరంలో ఉండటం వల్ల, దానిని చూడటం అసాధ్యం. దానిని చూడాలంటే ఖచ్చితంగా శక్తివంతమైన టెలిస్కోప్ లేదా కనీసం బైనాక్యులర్స్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిలువు వరుసలో అమరవు!
సాధారణంగా 'గ్రహాల అమరిక' అనగానే గ్రహాలన్నీ ఒకదాని వెనుక ఒకటి స్కేలుతో గీసినట్టు నిలువుగా నిలబడతాయని చాలామంది పొరబడతారు. కానీ అంతరిక్షంలో గ్రహాలన్నీ ఒకే తలంలో (Ecliptic Plane) సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమి నుంచి మనం ఆకాశం వైపు చూసినప్పుడు, అవన్నీ ఒకే సరళరేఖ మార్గం వెంట పక్కపక్కనే దగ్గరగా సర్దుకున్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. ఏదేమైనా, టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉన్నవారికి జూలై 17 రాత్రి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.














Click it and Unblock the Notifications