ఎల్ నినో.. మరింత భీకరం: అంచనాలకు మించిన స్థాయిలో.. !!
పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో జరిపిన తాజా పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పసిఫిక్ మహాసముద్ర పరిధిలో ఎల్ నినో ప్రభావం ముందుగా అంచనా వేసిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు తేలింది. పసిఫిక్ మహాసముద్రం గగనతలంపై భారీగా మార్పులు చోటు చేసుకుంటోన్నాయని, ఇవి భవిష్యత్తులో గ్లోబల్ క్లైమేట్ వ్యవస్థపై చూపించబోయే తీవ్ర పర్యావరణ ప్రభావాలకు కేంద్రబిందువు అవుతుందని నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టులు తాజాగా ఎల్ నినోపై ప్రత్యేకంగా శాటిలైట్ల ద్వారా అధ్యయనం చేశారు. గతంలో ప్రయోగించిన ఓషన్ శాట్ 3, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డేటాను దీన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఓషన్ శాట్ కలర్ మానిటర్ 3 (OCM-3), ఈఓఎస్-6 స్కాటెరోమీటర్ ఉపగ్రహాల నుంచి సేకరించిన కీలక డేటాను విశ్లేషించారు. దీని వివరాలను తాజాగా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పొందుపరిచింది ఇస్రో.

ఇందులో భాగంగా 2023 నుంచి 2026 వరకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సముద్ర ఉపరితల గాలులు, క్లోరోఫిల్ ఎ పరిమాణంలో సంభవించిన మార్పులను నిశితంగా అంచనా వేశారు. దీని ప్రకారం సాధారణంగా పసిఫిక్ రీజియన్ లో తూర్పు దిశగా వీచే గాలులు ఒక్కసారిగా బలహీనపడి, పడమర దిశగా వీచడం ప్రారంభించాయి. దీనివ్ల సముద్ర గర్భంలో సహజంగా చోటు చేసుకునే అప్ వెల్లింగ్.. అంటే కింది నీరు పైకి రావడం అనే ప్రక్రియ పూర్తిగా మందగించింది.
ఫలితంగా చల్లటి నీరు సముద్ర ఉపరితలానికి చేరట్లేదు. ఫలితంగా.. సముద్రంలో పెరిగే ఏకకణ సూక్ష్మజీవులైన ఫైటోప్లాంక్టన్ వృద్ధి నిలిచిపోయింది. క్లోరోఫిల్ పరిమాణం భారీగా పడిపోయింది. సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్న 2024, 2025 జూన్ నెలలతో పోలిస్తే, ఎల్ నినో పరిస్థితులు ప్రారంభమైన ఈ ఏడాది జూన్ నాటికి క్లోరోఫిల్ స్థాయిలో విపరీతమైన వ్యత్యాసం కనిపించింది. ఆందోళనకంగా దీని స్థాయి పడిపోయింది.
ప్రత్యేకించి.. పశ్చిమ, మధ్య పసిఫిక్ లోని భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. సముద్ర ఉపరితల గాలులు, అక్కడ పెరిగే జీవజాతుల ఉత్పాదకతకు మధ్య ఎంతటి బలమైన పరస్పర సంబంధం ఉందో ఈ అధ్యయనం స్పష్టం చేసినట్టయింది. ప్రపంచ వాతావరణ సంస్థ గతంలో వెల్లడించిన అంచనాలకు అనుగుణంగానే ఇస్రో ఉపగ్రహాలు సేకరించిన తాజా డేటా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్ నినో పరిస్థితులు బలపడేందుకు దాదాపు 80 శాతం వరకు అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ ముందే హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఇస్రో సేకరించిన తాజా డేటా నిర్ధారించింది. జూలై నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఒకవేళ ఎల్ నినో ప్రభావం గనుక ఇంకా తీవ్రమైతే, క్లోరోఫిల్ తక్కువగా ఉండే ప్రాంతాలు మరింత ముప్పును ఎదుర్కొనడం ఖాయం.
El Niño is leaving its fingerprint on the ocean—and ISRO’s satellite is watching!
— ISRO (@isro) September 11, 2026
ISRO’s EOS-06 (Oceansat-3) is detecting a reduction in ocean Chlorophyll-a for the month of June 2026, indicating changes in tiny marine plants (phytoplankton), along with a shift in surface… pic.twitter.com/tMRR8pdBuD
పర్యావరణానికి కలుగుతున్న ఈ నష్టాన్ని నిశితంగా అంచనా వేయడానికి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో పేర్కొంది. రానున్న రోజుల్లో సముద్ర గర్భ ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాల ఎత్తు, థర్మోక్లైన్ డెప్త్, సముద్ర నీటి ప్రవాహాల కదలికలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మాత్రమే ఈ గ్లోబల్ క్లైమేట్ మార్పులను అరికట్టవచ్చని చెబుతోంది.














Click it and Unblock the Notifications
