ప్రపంచానికి బొత్తిగా తెలియని 57 కొత్త జీవులు..
అట్లాంటిక్ మహాసముద్రం అగాధంలో మానవ ప్రపంచానికి అందని వింత ప్రపంచం ఒకటి దాగి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అర్జెంటీనా తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో ఉన్న లోతైన లోయలలో పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తల బృందం, ఇప్పటివరకు సైన్స్ ప్రపంచానికి బొత్తిగా తెలియని 57 కొత్త జీవులను కనుగొని సంచలనం సృష్టించింది. సముద్ర మట్టానికి వేలాది మీటర్ల లోతున, కాంతి రేఖ కూడా తాకని చీకటి అగాధంలో సీ కుకుంబర్లు, వింత పగడాలు, కస్టేషియన్లు వంటి అనేక రకాల విచిత్ర జీవులు పలకరించడం అంతర్జాతీయ సైన్స్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాంతికి అందని లోతుల్లో రహస్య అన్వేషణ!
ఆగస్టు 2025లో చేపట్టిన ఈ అన్వేషణ కోసం శాస్త్రవేత్తలు 'సుబాస్టియన్ అనే రిమోట్ ఆపరేటెడ్ వాహనాన్ని సముద్ర అడుగుభాగంలోకి పంపారు. అర్జెంటీనా సమీపంలోని 'మార్ డెల్ ప్లాటా' సముద్ర లోయల్లో ఏకంగా 3,500 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లి పరిశోధనలు సాగించారు. ఉపరితలం కంటే పూర్తిగా భిన్నమైన పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే ఈ చీకటి లోయల్లో సముద్ర జీవులను సేకరించి వాటిపై టాక్సానమీ నిర్వహించారు.

57 కొత్త జీవులు.. 5 కొత్త జాతులు!
సేకరించిన నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 57 కొత్త జీవులను అధికారికంగా గుర్తించారు. సముద్రపు ఆహార గొలుసులో కీలక పాత్ర పోషించే 20 కొత్త రకాల 'కోపెపోడ్స్' (చిన్న తరహా పీత జాతి జీవులు), సీ కుకుంబర్లు, క్రినోయిడ్‌లతో కూడిన 22 రకాల ఎకినోడెర్మ్‌లు, పగడాలు, సీ పెన్స్ కలిగిన 14 నైడేరియన్ జీవులను కనుగొన్నారు. వీటన్నింటితో పాటు మోలస్క్ రకానికి చెందిన వింత జీవిని కూడా గుర్తించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న జీవ వర్గీకరణలోనే లేని 5 సరికొత్త జన్యు జాతులను కనుగొనడం ఈ ప్రయోగానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది.
కొమ్ములున్న వింత జీవి.. దానికి 'లోకి' అని పేరు!
ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తల దృష్టిని బాగా ఆకర్షించిన జీవి దాదాపు 2,577 మీటర్ల లోతులో లభించిన ఒక వింత సీ కుకుంబర్. దీని శరీరానికి కొమ్ముల వంటి భాగాలు ఊహించని రీతిలో ఉండటంతో, మార్వెల్ సినిమాలో పాపులర్ అయిన స్కాండినేవియన్ పురాణాల దేవుడు 'లోకి' (Loki) పేరును శాస్త్రవేత్తలు దీనికి నామకరణం చేశారు. ఈ ఒక్క యాత్రలోనే ఏకంగా 10 రకాల కొత్త సీ కుకుంబర్ జాతులు వెలుగులోకి వచ్చినట్లు భావిస్తున్నారు.
ఇది ఆరంభం మాత్రమే.. తేలాల్సింది ఎంతో ఉంది!
సముద్రం అడుగున దాగిన జీవ వైవిధ్యంతో పోలిస్తే తాము కనుగొన్నది చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. సేకరించిన నమూనాలలో ఇంకా కొంత భాగాన్ని మాత్రమే విశ్లేషించామని, రాబోయే రోజుల్లో మరిన్ని వింత జీవులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మారుమూల సముద్ర గర్భంలో ఉండే ఈ జీవుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పర్యావరణ మార్పులకు సముద్ర వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
