Video: కంటిని మోసం చేస్తున్న అరుదైన దృశ్యం.. మేఘాల నుంచి జాలువారుతున్న జలపాతం..
ప్రకృతి సృష్టించే వింతలు, విశేషాలు ఎప్పుడూ మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా బ్రెజిల్‌లోని ఓ గుహ వద్ద ఆకాశం నుంచి నేరుగా నీరు కిందకు పడుతున్నట్లు కనిపిస్తున్న దృశ్యం నెటిజన్లను మైమరపిస్తోంది. అక్కడ నీటి ధారలు మేఘాల నుంచే నేరుగా జాలువారుతున్నాయా అన్నట్లుగా కనిపించడం అందరినీ అబ్బురపరుస్తోంది. స్థానిక ఫొటోగ్రాఫర్ గిబా మొరాయిస్ ఈ అద్భుతాన్ని తన కెమెరాలో బంధించడంతో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది.
ఆకాశం నుంచి పడుతున్నట్లు ఎలా కనిపిస్తోంది?
ఫస్ట్ ఈ విజువల్ చూసిన వారెవరైనా సరే ఆకాశంలో మేఘాల నుంచే నీరు జలపాతంలా కిందకు పడుతోందని భ్రమపడతారు. కానీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. బ్రెజిల్‌లోని ఐపోరంగా ప్రాంతంలో ఉన్న 'కాసా డి పెడ్రా' గుహ ప్రవేశ ద్వారం పైభాగంలో ఉన్న ఒక చిన్న రాతి పగులు నుంచి ఈ నీరు కిందకు ప్రవహిస్తోంది. అయితే, ఫొటోగ్రాఫర్ గుహ కింద నుంచి ఆకాశం వైపు లో యాంగిల్ షాట్ తో ఈ దృశ్యాన్ని తీయడం వల్ల అది నేరుగా మేఘాల నుంచే పడుతున్నట్లు కంటిని మోసం చేసేలా కనిపించింది.

ఆకాశంలో రంగుల వెలుగుల విన్యాసం
కేవలం జలపాతం రూపమే కాకుండా, ఆ సమయంలో ఆకాశంలో కనిపించిన ఇంద్రధనుస్సు కాంతులు ఈ దృశ్యానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. వాతావరణంలో తేలియాడే నీటి బొట్లు, ఆకాశంలో చాలా ఎత్తులో ఉండే సిర్రోస్ట్రాటస్ మేఘాల్లోని మంచు స్పటికాల గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఈ రంగుల కాంతులు ఏర్పడ్డాయి. సూర్యకాంతి ఆ మంచు స్పటికాలలో వంగి ప్రయాణించడం వల్ల (కాంతి వక్రీభవనం) గుండ్రటి వలయాల్లాంటి రంగుల కాంతులు (హలో ప్రభావం) ఆకాశంలో ఏర్పడి జలపాతానికి వెనుక అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌గా నిలిచాయి.
ప్రపంచంలోనే ఎత్తైన గుహల ప్రవేశ ద్వారం
ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకున్న బ్రెజిల్‌లోని సావోపాలో రీజియన్‌లో ఉన్న 'కాసా డి పెడ్రా' గుహకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుహ ద్వారాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇటీవల అత్యాధునిక లైడార్ (LiDAR) సాంకేతికతతో జరిపిన పరిశోధనల్లో ఈ గుహ ముఖద్వారం ఎత్తు ఏకంగా 197 మీటర్లు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ ఎత్తు ఉన్న రాతి శిఖరం పైనుంచి నీరు పడుతుండటం, దానికి తోడు సరైన కోణంలో ఫొటో తీయడంతో ఈ అద్భుతమైన విజువల్ ఇల్యూషన్ సాధ్యమైంది.














Click it and Unblock the Notifications
