1980s: ఫ్రీగా వచ్చే ఫోటోల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అందరూ 1980ల నాటి హెయిర్ స్టైల్స్, వింటేజ్ బట్టలు, పాతకాలపు రెట్రో లుక్ ఉన్న ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. పాత జ్ఞాపకాలను మళ్లీ పరిచయం చేస్తున్న ఈ '80s AI సెల్ఫీ' ట్రెండ్ చూడటానికి చాలా సరదాగా, ఉచితంగా లభిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ, మీరు "జెనరేట్" అని క్లిక్ చేసిన ప్రతిసారీ పర్యావరణంపై ఎంతటి భారం పడుతుందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! ఒక సరదా ఫోటో వెనుక ఎలక్ట్రిసిటీ, నీటి వినియోగం, భారీ డేటా సెంటర్లు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క ఫోటోకు టన్నుల కొద్దీ కరెంట్.. పెరిగిపోతున్న భారం!
మనం సరదాగా ఒక ఏఐ ఇమేజ్ తయారు చేయడానికి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు.. సాధారణ టెక్స్ట్ మెసేజ్ కంటే దాదాపు 1,450 రెట్లు ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుందని ఐక్యరాజ్యసమితి సర్వేలు చెబుతున్నాయి. డేటా సెంటర్లు, అందులోని ప్రాసెసర్లు నిరంతరం పనిచేయడమే దీనికి కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వినియోగం పెరగడంతో డేటా సెంటర్ల కరెంట్ బిల్లులు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే 2030 నాటికి కేవలం ఏఐ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం ఏకంగా 950 టెరావాట్ అవర్లకు (TWh) చేరుకోవచ్చని అంచనా.

నీటి వినియోగం కూడా అపారమే!
అత్యంత వేగంగా పనిచేసే ఏఐ సర్వర్లు విపరీతంగా వేడెక్కుతాయి. వాటిని చల్లబరచడానికి కోట్లాది లీటర్ల మంచి నీటిని ఉపయోగిస్తున్నారు. ఒక్క ఏఐ ఇమేజ్ జెనరేట్ చేయడానికి దాదాపు 29 మిల్లీలీటర్ల (రెండు చెంచాలు) నీరు పరోక్షంగా ఖర్చవుతుంది. అదే ఒక చిన్న ఏఐ వీడియో చేయాలంటే ఏకంగా 4 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇలా 2030 నాటికి ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.3 ట్రిలియన్ లీటర్ల నీటి వినియోగం జరుగుతుందని అంచనా. ఇది ఆఫ్రికాలోని 130 కోట్ల మంది ప్రజల వార్షిక తాగునీటి అవసరాలతో సమానం అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వాతావరణ మార్పుల ముప్పు ముంచుకొస్తోంది
ప్రపంచం ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెంపు వైపు వేగంగా పయనిస్తోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (UNEP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే నేపాల్‌లో వచ్చిన భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు వాతావరణ మార్పులకు పరాకాష్టగా నిలిచాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఏఐ టెక్నాలజీ వల్ల పెరుగుతున్న విద్యుత్, నీటి డిమాండ్ పర్యావరణంపై మరింత ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రీబౌండ్ ఎఫెక్ట్: ఒక ఫోటోతో ఆగుతున్నారా?
సాధారణంగా ఎవరూ ఒక ఫోటోతో ఆగిపోరు. నచ్చకపోతే మరో ఫోటో, ఆ తర్వాత హెయిర్ స్టైల్ మార్చి మరొకటి, ఆపై గ్రూప్ ఫోటో, చివరకు ఒక చిన్న వీడియో.. ఇలా గంటల తరబడి ఏఐతో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. సాంకేతికత పెరిగి ఎంత చౌకగా, వేగంగా ఏఐ సేవలు అందుబాటులోకి వస్తే.. జనాలు దాన్ని అంత ఎక్కువగా వాడటం మొదలుపెడతారు. ఆర్థిక శాస్త్రంలో దీనిని 'రీబౌండ్ ఎఫెక్ట్' అంటారు. ఇది కాకుండా, ఏఐ హార్డ్‌వేర్ కోసం వాడే ఖనిజాలు, దెబ్బతింటున్న ప్రాసెసర్ల వల్ల 2030 నాటికి 25 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పేరుకుపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
మరోవైపు ఏఐపై తీవ్ర ఆందోళనలు
పర్యావరణ సమస్యలు ఒకెత్తయితే, ఏఐ సాంకేతికత మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతోందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధన సంస్థ 'ఆంత్రోపిక్' నుంచి ఇటీవల రాజీనామా చేసిన నిపుణులు.. హద్దు అదుపు లేని ఏఐ రేసు మానవాళి జీవనంతో చెలగాటమాడుతోందని స్పష్టం చేశారు. మున్ముందు ఏఐ వల్ల మానవాళి అంతమయ్యే ప్రమాదం 10 శాతానికి పైగా ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
ఏఐ అనేది పర్యావరణ మార్పులను అంచనా వేయడానికి, వాతావరణ హెచ్చరికలు జారీ చేయడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతున్నప్పటికీ.. ఇలాంటి చిన్న చిన్న సోషల్ మీడియా సరదాల కోసం బిలియన్ల కొద్దీ ఫోటోలు తయారు చేయడం వల్ల పర్యావరణం చెల్లిస్తున్న మూల్యం మాత్రం చాలా పెద్దది!














Click it and Unblock the Notifications
