ChatGPT: UIUC సర్వే సంచలనం.. చీట్ చేయడానికి ChatGPT.. కేవలం 1 డాలర్‌తోనే..
Cheating with ChatGPT: చాట్‌జీపీటీని మారుతున్న టెక్నాలజీకి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ సాంకేతికత ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కావాల్సిన పనిని సులభంగా చేసుకోగలిగే విధంగా ఓపెన్ ఏఐ దీన్ని క్రియేట్ చేసింది. కానీ ఇదే చాట్‌జీపీటీ ఇప్పుడు అక్రమార్కులకు కూడా వరంగా మారడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇల్లినాయిస్ యూనివర్సిటీ అర్బానా-చాంపెయిన్ (UIUC) తన కీలక అధ్యయనం ఫలితాలను వెల్లడించింది. చాట్‌జీపీటీలోని కొత్త భద్రతా లోపాలను ఇది పాయింట్ చేసింది. ముఖ్యంగా దీని రియల్-టైమ్ వాయిస్ APIని, సైబర్ నేరస్తులు ఆర్థిక మోసాలకు ఉపయోగించవచ్చని చెప్పి షాక్ ఇచ్చింది. చాట్‌జీపీటీ ఆధారంగా మోసగాళ్లు ఎలా బురిడీ కొట్టిస్తారో కూడా చేసి చూపించింది. క్రిమినల్స్ వాస్తవ వ్యక్తులను అనుకరించి, వివిధ సంస్థల తరఫున మాట్లాడుతున్నామంటూ వినియోగదారులను మోసం చేయవచ్చని తెలిపింది.

UIUC బృందం బాధితుడిగా మారి ChatGPT-4o వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించి చేయగలిగిన మోసపూరిత చర్యలను పరీక్షించింది. క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్‌లు, గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లు, జీమెయిల్ మరియు ఇన్‌స్టా పాస్‌వర్డ్ మోసాలు వంటి పద్ధతులను టెస్ట్ చేసింది. ఇందులో 20 నుంచి 60 శాతం మేర విజయం సాధించినట్లు పేర్కొంది. అయితే ఈ తరహా స్కామ్‌లు చేసేందుకు కేవలం 1 డాలర్, అతి క్లిష్టమైన బ్యాంక్ ట్రాన్స్ఫర్ స్కామ్ నిర్వహణకు కూడా సుమారు 2.51 డాలర్ల కంటే తక్కువే ఖర్చవుతుందని బాంబ్ పేల్చింది.
కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్‌ల విషయంలో వెబ్‌సైట్ నావిగేషన్ క్లిష్టత వల్ల విజయవంతం కాలేకపోయినట్లు వివరించింది. కానీ జీమెయిల్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ తస్కరించడంతో మాత్రం వరుసగా 60 మరియు 40 శాతం చొప్పున విజయవంతమైనట్లు చెప్పింది. ఈ దుర్వినియోగానికి ప్రస్తుతం పరిమితులు ఉన్నప్పటికీ, తక్కువ ఖర్చుతోనే సైబర్ నేరస్తులకు మోసాలు చేయగల అవకాశాలు ఉండటం కలవర పరుస్తోంది.
ఈ నివేదికపై OpenAI స్పందించింది. ChatGPT భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు ధ్రువీకరించింది. UIUC వంటి సంస్థల పరిశోధన పత్రాలు.. మోసపూరిత చర్యలను నిరోధించడంలో మరియు AI సామర్థ్యాలను మెరుగుపరచడంలో విలువైన వనరులుగా ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ సాంకేతికత వినియోగం మరియు సృజనాత్మకతను కోల్పోకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications