U- 13: ఫేస్‌బుక్, ఇన్‌స్టా పై మైండ్ బ్లాక్ అయ్యేంత భారీ ఫైన్- దెబ్బకు జుకర్‌బర్గ్ కుదేల్
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాతృసంస్థ మెటాపై భారీ జరిమానా పడింది. దీని విలువ.. 567 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు 4,750 కోట్ల రూపాయలకు పైమాటే. ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వల్ల యువతపై పడుతున్న దుష్ప్రభావాలను అరికట్టడంలో భాగంగా అమెరికాలోని న్యూ మెక్సికో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదానికి సంబంధించి విచారణలో భాగంగా తుది తీర్పు వెలువరించింది.
న్యూ మెక్సికో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రయాన్ బీడ్‌షీడ్ ఈ నిధుల వినియోగానికి సంబంధించి పక్కా ప్రణాళికను వివరించారు. ఈ నిధుల్లో అధిక భాగం.. అంటే సుమారు 420 మిలియన్ డాలర్లను సోషల్ మీడియా ప్రభావం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న యువతకు చికిత్సను అందించడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్మును రాబోయే అయిదేళ్ల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు, అడ్వాన్స్ స్క్రీనింగ్, ఇతర చర్యల కోసం ఖర్చు చేయాలని జడ్జి స్పష్టం చేశారు.

ఇది రెండో విడత విచారణ. మెటా సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈ కేసు మొదటి విడత విచారణ సమయంలోనే మేజిస్ట్రేట్ జ్యూరీ నిర్ధారించింది. చిన్నారుల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగానే కొనసాగించిందని, దీనికి సమాచారాన్ని దాచిపెట్టిందని కోర్టు గుర్తించింది. ఆ సమయంలో మెటాకు 375 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. తాజా తీర్పుతో మెటా చెల్లించాల్సిన మొత్తం జరిమానా భారం 567 మిలియన్ డాలర్లకు పెరిగింది.
జరిమానాను విధించడంతోనే ఆగలేదు కోర్టు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేయాలని ఆదేశించింది. యూజర్ల భద్రత కోసం అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్లు, వాటిని ఉపయోగించే విధానం, అసభ్యకర వ్యాఖ్యలను అడ్డుకునే మార్గాలను వివరించే నివేదికలను యూజర్లకు తెలియజేస్తూనే ఉండాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించే అధికారం స్థానిక ప్రభుత్వాలకు అప్పగించింది కూడా.
ఫెడరల్ నిబంధనల ప్రకారం 13 ఏళ్ల లోపు చిన్నారుల నుంచి ఎలాంటి వ్యక్తిగత వివరాలను సేకరించి వయస్సును ధృవీకరించే వీలులేదు. ఈ నిబంధన ఉండటం వల్ల వయస్సు నిర్ధారణ విషయంలో మెటాకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది న్యాయస్థానం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి యూజర్ల వయస్సును అంచనా వేయాలని కోర్టు నిర్దేశించింది. యూజర్ల స్నేహితులు, వారు పోస్ట్ చేసే అప్‌డేట్స్, తరచూ చూసే కంటెంట్ ఆధారంగా వయస్సును అంచనా వేసే ప్రత్యేక ప్రిడిక్షన్ మోడల్‌ను రాబోయే రెండేళ్లలో మెటా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా యూజర్ వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లు ఏఐ ద్వారా గుర్తిస్తే, మెటా సంస్థ వారి వయస్సు ధృవీకరణను అడగాల్సి ఉంటుంది. వయస్సు నిర్ధారణ పూర్తయ్యే వరకు సదరు యూజర్ మైనర్‌గానే పరిగణించి పరిమితులు విధించాలి. వారి నుంచి సేకరించిన పాత వ్యక్తిగత సమాచారాన్ని కూడా సర్వర్ల నుంచి పూర్తిగా తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ప్రైవసీ నిబంధనల అమలును మరింత పటిష్టం చేయడానికి మెటా సంస్థ స్థానిక పాఠశాలలు, బాలల సంరక్షణ స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం వహించాలి. దీని ద్వారా టీచర్లు, ఇతర బోధనేతర సిబ్బంది 13 ఏళ్ల లోపు ఉన్న మైనర్ల ప్రొఫైళ్లను నేరుగా గుర్తించి మెటా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుంది. ఈ మార్పుల అమలుపై సంస్థ ప్రతి ఏటా రెండుసార్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.





Click it and Unblock the Notifications