అంతరిక్షం నుంచి ఓటు వేయడమంటే..!!
US Presidential election 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
నవంబర్‌లో..
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ తమ ప్రచార కార్యక్రమాలు, డిబేట్లను ముమ్మరం చేశారు.

ఐఎస్ఎస్ నుంచి..
ఈ ఎన్నికల్లో ఓ వినూత్న ప్రక్రియకు తెర తీయబోతోంది. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నాసా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్.. అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బ్యాలెట్ పేపర్లు
ఈ విషయాన్ని సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ స్వయంగా వెల్లడించారు. అంతరిక్ష కేంద్రం నుంచి నాసా స్పేస్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాలట్‌ను తమకు పంపించాలంటూ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారని, రెండు వారాల్లోగా బ్యాలెట్ పేపర్ తమకు అందుతుందని అన్నారు.
ఇప్పటికి ఇద్దరు..
అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములు ఓటు వేసేలా 1997లో అమెరికా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అప్పట్లో టెక్సాస్ లెజిస్లేచర్ ఓ బిల్లును ఆమోదించింది కూడా. ఇప్పటివరకు ఇద్దరు వ్యోమగాములు మాత్రమే ఐఎస్ఎస్ నుంచి ఓటు వేశారు. 1997లో నాసా ఆస్ట్రోనాట్ డేవిడ్ వోల్ఫ్, 2019లో కేట్ రూబిన్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఫిబ్రవరిలో రాక..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ విల్మోర్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమ్మీదికి రానున్నారు. వారిని భూమి మీదికి తీసుకుని రావడానికి నాసా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ ఉత్త చేతులతో భూమికి తిరిగొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ అందులో ట్రావెల్ చేయలేదు. ఐఎస్ఎస్‌లోనే ఉండిపోయారు.
10 రోజుల ఆపరేషన్ కాస్తా..
ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్కడికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications