Cyclone Murasu: పలచబడిన 'అర్నబ్'.. మొదలైన మురసు ప్రతాపం
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ దాని ప్రభావం మాత్రం తగ్గలేదు. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగళ్ల వానలు, ఈదురు గాలులతో దేశంలోని పలు రాష్ట్రాలు నానిపోతున్నాయి. బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం పుట్టుకురావడంతో రానున్న రోజుల్లో కూడా ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన 'అర్నబ్' తీవ్ర తుపాను బలహీనపడినప్పటికీ, దాని శేష ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో డిప్రెషన్‌గా మారిన ఈ వ్యవస్థ క్రమంగా ఉత్తర దిశగా పయనిస్తూ అల్పపీడనంగా మారుతోంది. ఇది బలహీనపడుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా గాలిలో ఉన్న తేమను పెంచి పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు కారణమవుతోంది.

ఢిల్లీ నుంచి బీహార్ వరకు.. వడగళ్లు, భారీ వర్షాల హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిసర ప్రాంతాలతో పాటు హర్యానా, పంజాబ్, ఈస్ట్ రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. పలుచోట్ల వడగళ్ల వాన (హెయిల్ స్టోర్మ్) కురిసే ప్రమాదం ఉందంటూ ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
ఏపీ వైపు కదులుతున్న కొత్త ఆవర్తనం!
ఇదిలా ఉంటే, దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక కొత్త అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది మరింత పుంజుకుని పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం వైపు పయనించనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారనున్న ఈ వ్యవస్థ, ఆ తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. కంటిమీద కునుకు లేని రైతన్న!
ఈ వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కంచిలి వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో దాదాపు 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. రాబోయే వారం రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
