వైభవ్‌కు బిగ్ షాక్.. గేల్ రికార్డును ముందే కొట్టేసిన భారత యువ కెరటం!
టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్లు, ఫోర్లతో మోత మోగిపోతుంది. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 నాటౌట్) రికార్డు ఎవరూ చేరుకోలేనంత ఎత్తులో ఉండేది. అయితే గుజరాత్‌కు చెందిన యువ క్రికెటర్ ఆర్య దేశాయ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. సూరత్ క్రికెట్ టీ20 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 81 బంతుల్లోనే 193 పరుగులు సాధించి టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
81 బంతులు.. 193 పరుగులు.. ఇదొక విధ్వంసం
ఆర్య దేశాయ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల వరద మాత్రమే కాదు.. అదొక ప్యూర్ పవర్ హిట్టింగ్ షో. తన ఇన్నింగ్స్ పొడవునా మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో మొత్తం 21 ఫోర్లు, 14 భారీ సిక్సర్లు ఉన్నాయి. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) గుర్తింపు పొందిన ఈ టోర్నీలో ఆర్య దేశాయ్ బ్యాటింగ్ చూస్తుంటే.. ఓ వీడియో గేమ్‌లో ఆడుతున్నట్లుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 200 పరుగుల మైలురాయికి కేవలం 7 పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ.. ఆర్య ఇన్నింగ్స్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది.

వైభవ్ సూర్యవంశీ కంటే ముందు బాదుడు
ఈ రికార్డు వెనుక మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఇటీవలే 14 ఏళ్ల బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో తాను క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు ప్రయత్నం చేయకముందే.. 22 ఏళ్ల ఆర్య దేశాయ్ ఈ ఘనత సాధించడం విశేషం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆర్య పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా స్థానిక క్రికెట్ నుంచి ఇలాంటి భారీ స్కోరు రావడం జాతీయ సెలెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
ఎవరీ ఆర్య దేశాయ్?
ఆర్య దేశాయ్ ఏదో అదృష్టవశాత్తు ఈ పరుగులు చేయలేదు. ఆర్య దేశాయ్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో మంచి గుర్తింపు ఉన్న ఆటగాడు. గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు సభ్యుడిగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో గుజరాత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత రంజీ సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసి తన సత్తా చాటాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) శిబిరాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే ఆర్య దేశాయ్.. ఇండియా అండర్-23 జట్టుకు కూడా ఎంపికైన ప్రతిభావంతుడు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రశంసలు.. ఐపీఎల్ ఆశలు
ఆర్య దేశాయ్ అసాధారణ ఇన్నింగ్స్‌పై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించారు. "నేను నా కెరీర్‌లో బంతిని ఇంత క్లీన్‌గా, పవర్‌ఫుల్‌గా హిట్ చేసే ఆటగాడిని చూడలేదు" అని ఆయన పేర్కొన్నారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆర్య దేశాయ్‌కి ఐపీఎల్ 2026లో భారీ డిమాండ్ తీసుకువచ్చేలా ఉంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అతని ఆట తీరును గమనిస్తున్నట్లు సమాచారం. ఈ యువ కిరణం భవిష్యత్తులో టీమిండియా తరపున కూడా మెరుపులు మెరిపించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications