చేజేతులా వికెట్ పారేసుకున్న అభిషేక్ శర్మ: సంజు శాంసన్ దీ పాతకథే
జపాన్ ఐచి- నగోయాలో కొనసాగుతున్న ఆసియా గేమ్స్ లో భాగంగా దాయాదుల ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం సరిగ్గా 9:30 గంటలకు టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ పై ఈ మ్యాచ్ లో ఛేజింగ్ కే ప్రాధాన్యత ఇచ్చాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. వంటి స్టార్ ప్లేయర్లు తుదిజట్టులో ఉండటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
జపాన్ నిస్సిన్ సిటీలో గల కొరోగీ అథ్లెటిక్ పార్క్ స్టేడియం.. ఈ మ్యాచ్ కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణం సాధించాలని పట్టుదలగా ఉండగా, పాకిస్థాన్ తొలిసారి పసిడి పతకాన్ని ముద్దాడాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. దేశానికి డబుల్ ధమాకా లభిస్తుంది. ఇప్పటికే ఫైనల్ లో శ్రీలంకను ఓడించి భారత మహిళల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ ప్రారంభంలో భారత్ తడబడింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లతో 15 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. దూకుడుగా ఆడినప్పటికీ.. ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. సయీం అయూబ్ బౌలింగ్ లో ఉస్మాన్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతని తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా విఫలం అయ్యాడు. రెండు పరుగులే చేసి అహ్మద్ డానియల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఈ రెండు వికెట్లు వరుసగా పడినప్పటికీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. పిడుగుల్లాంటి షాట్లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ అదే రేంజ్ లో సెంచరీ వైపు దూసుకెళ్తోన్న దశలో అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేసిన అనంతరం అరాఫత్ మిన్హాస్ బౌలింగ్ లో స్టంపవుట్ గా వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే క్రమంలో క్రీజ్ నుంచి బయటికొచ్చిన అభిషేక్ టైమింగ్ మిస్ అయ్యాడు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ వికెట్లను గిరాటేశాడు.












Click it and Unblock the Notifications
