SRH ఇచ్చే డబ్బులు చాలట్లేదు- అందుకే గుడ్ బై చెప్పా: స్టార్ ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ రానురాను రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ముగిశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ విజయం సాధించాయి. తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు అయిదో మ్యాచ్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. లక్నో స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ పరిస్థితుల సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్, ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్నర్ ఆడమ్ జంపా తెరమీదికి వచ్చాడు. ఈ ఐపీఎల్ నుండి ఎందుకు తప్పుకున్నాడో వివరించాడు. దీనికి గల కారణాలను వెల్లడించాడు. తన బౌలింగ్ నైపుణ్యానికి అనుగుణంగా పారితోషికం లేకపోవడం, ఐపీఎల్ రెండు నెలల పాటు ఆడాల్సి రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేయడంతో జంపా గత ఏడాది మినీ వేలంలో పాల్గొనలేదు.

జంపా అయిదు ఐపీఎల్ సీజన్‌లు ఆడాడు. 2016 నుండి నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 22 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఏ ఐపీఎల్ టీమ్‌లోనూ రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. గత ఏడాది మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 2.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం.. అతని అత్యధిక ఆదాయం. సన్ రైజర్స్ అతన్ని విడుదల చేశాక ఐపీఎల్ వేలానికి దూరం అయ్యాడు. ఇందులో పాల్గొనలేదు.
దీనికి గల కారణాలను తాజాగా ఏఆర్ వై పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకున్నానని, తన ఆట తీరు, నైపుణ్యానికి అనుగుణంగా, తోటి ప్లేయర్ల మాదిరిగా ఐపీఎల్ లో డబ్బు లభించట్లేదని చెప్పాడు. పైగా రెండు నెలల పాటు సుదీర్ఘంగా ఈ టోర్నమెంట్ ను ఆడాల్సి వస్తోందని, అన్ని రోజుల పాటు ఐపీఎల్ కు కేటాయించడం తనకు సరైనదిగా అనిపించలేదని జంపా వివరించాడు.
ఐపీఎల్‌కు దూరంగా ఉన్నప్పటికీ, జంపా ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఈ జట్టుకు డేవిడ్ వార్నర్ కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. పీఎస్‌ఎల్ వేలంలో కరాచీ కింగ్స్ అతన్ని 4.5 కోట్ల పాకిస్తాన్ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 1.51 కోట్ల రూపాయలకు సమానం. ఐపీఎల్ నుండి బ్రేక్ తీసుకోవాలనుకున్నానని, నెల రోజుల కిందట పీఎస్‌ఎల్ ఆఫర్ వచ్చిందని గుర్తు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ రికార్డులను సాధించాడు ఆడమ్ జంపా. 2016లో నాలుగు ఓవర్లకు 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో ఆరు వికెట్ల హాల్ సాధించిన ఏకైక స్పిన్నర్ అతనే. 2016లో తన తొలి ఐపీఎల్ సీజన్‌లో విశాఖపట్నంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ ఘనత సాధించాడు. పీఎస్ఎల్ లో రెండు మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీశాడు.












Click it and Unblock the Notifications