పూరన్.. సడన్ షాకింగ్ డెసిషన్
Nicholas Pooran: వెస్టిండీస్ కు చెందిన డాషింగ్ ప్లేయర్ నికొలస్ పూరన్.. క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డేలు, టీ20.. ఇలా అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు.
ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. క్రికెట్ అభిమానులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు నికొలస్ పూరన్ వంతు వచ్చింది. 29 సంవత్సరాల వయస్సులోనే అతను క్రికెట్ కు దూరం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తన రిటైర్మెంట్ కు గల కారణాలను ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో వివరించాడు పూరన్. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నా రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. తాను ఎంతగానో ప్రేమించే, ఆరాధించే ఈ గేమ్.. ఎంతో ఇచ్చిందని పేర్కొన్నాడు.
ప్రజలు ఎంతగానో ప్రేమించే క్రికెట్ లో దేశానికి ప్రాతినిథ్యాన్ని వహించడం తన అదృష్టంగా పేర్కొన్నాడు. వెస్టిండీస్ మెరూన్ కలర్ జెర్సీని ధరించే అవకాశాన్ని క్రికెట్ బోర్డు తనకు ఇచ్చిందని, గ్రౌండ్ లో అడుగు పెట్టిన ప్రతీసారీ వందశాతం చిత్తశుద్ధితో ఆడాడనని చెప్పుకొచ్చాడు పూరన్. జాతీయ జట్టుకు నాయకత్వాన్ని వహించే అవకాశం సైతం లభించిందని గుర్తు చేసుకున్నాడు.
2016లో అంతర్జాతీయ క్రికెట్ అడుగు పెట్టాడీ వికెట్ కీపర్ బ్యాటర్. 2016 నుంచి 2024 మధ్య 61 వన్డేలు, 106 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 61 వన్డేల్లో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో 1983 పరుగులు చేశాడు. 23 క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు అతని ఖాతాలో ఉన్నాయి.
టీ20 ఇంటర్నేషనల్స్ లో 97 ఇన్నింగ్స్‌ల్లో 136.39 స్ట్రైక్ రేట్‌తో 2,275 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు.. 98. ఐపీఎల్ తరువాత కొంత విరామం తీసుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఎంపిక కాలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. మొన్నీ మధ్యే ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్ లో 524 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 196.98 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.












Click it and Unblock the Notifications