భారత్- పాకిస్తాన్ మ్యాచ్: నెత్తిన తడిగుడ్డే
ఆసియా కప్ 2025లో భాగంగా దాయాది దేశాలు భారత్-పాకిస్తాన్ మధ్య ఎల్లుండి మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్లు తలపడబోతోన్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలు ఉన్న మ్యాచ్ ఇది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.. ఈ రెండు జట్లు. ఈ నెల 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభారంభం చేసింది టీమిండియా. అదే ఊపును పాకిస్తాన్ పైనా ప్రదర్శించడానికి ఉవ్విళ్లూరుతోంది.
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండటాన్ని ఇప్పటివరకు మనం చూశాం. కౌంటర్ల ముందు అర్ధరాత్రి నుంచే బారులు తీరి నిల్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. మ్యాచ్ మొదలు కావడానికి గడువు సమీపించినప్పటికీ- టికెట్లను కొనే వాడే లేడు. 50 శాతానికి పైగా టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఎమిరేట్స్ క్రికెట్ వెల్లడించింది.

దీనికి కారణాలు లేకపోలేదు. టీ20 ఫార్మట్ నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ కావడం, టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షుకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని, ఎమిరేట్స్ క్రికెట్ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడబోతోన్న మేజర్ టోర్నమెంట్ ఇదే. వారిద్దరూ లేకపోవడం.. టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని విశ్లేషించారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లకు ఆశించినంత డిమాండ్ ఉండట్లేదని ఎమిరేట్స్ క్రికెట్ అధికారి తేల్చి చెప్పారు. ఇప్పటివరకు స్టాండ్స్ టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని, అప్పర్, టాప్ టియర్ స్టాండ్ ఎంట్రీ టికెట్స్ ఇంకా తెగట్లేదని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఒకే రోజులో రెండుసార్లు టిక్కెట్లను అందుబాటులోకి తీసుకుని రావాల్సొచ్చిందని, నాలుగు నిమిషాల్లోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని అన్నారు. ఈసారి క్రేజ్ లేదని అన్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వీఐపీ సూట్స్ ఈస్ట్ టికెట్ ధర ఇద్దరికి కలిపి భారత కరెన్సీలో 2,57,815 రూపాయలు. ఈ ప్రీమియం డీల్‌లో ఐస్లే-సైడ్ సీటింగ్, అన్ లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్, వీఐపీ లాంజ్ ఎంట్రీ, క్లబ్ యాక్సెస్, పార్కింగ్ పాస్, స్పెషల్ ఎంట్రీ పాయింట్లు, రెస్ట్‌రూమ్స్ ఉన్నాయి. రాయల్ బాక్స్ ఇద్దరికి 2,30,700 రూపాయలు. స్కై బాక్స్ ఈస్ట్ ప్యాకేజీకి రూ. 1,67,851. ఈ మూడూ కూడా హైఎండ్ రేంజ్.
మిడిల్ లెవెల్ టిక్కెట్ల రేట్లు కూడా ఎక్కువే. ప్లాటినం- రూ.75,659, గ్రాండ్ లాంజ్- రూ. 41,153, పెవిలియన్ వెస్ట్- రూ. 28,174, జనరల్ ఈస్ట్ ఇద్దరికి కలిపి రూ. 9,800. కాగా- టికెట్లు అమ్ముడుపోకపోవడానికి బాయ్ కాట్ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. మ్యాచ్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు సైతం వెంటాడుతున్నాయి.












Click it and Unblock the Notifications