ట్రోఫీ ఇచ్చే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరు.. ముందే ప్యాకప్ చెప్పేసిన పీసీబీ బాస్!
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 3, శనివారం నాడు నిషిన్ కొరోగి స్పోర్ట్స్ పార్కులో స్వర్ణ పతక మ్యాచ్ జరగనుంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ పైనే నిలిచింది. అయితే ఫైనల్ జరిగే రోజున మొహ్సిన్ నఖ్వీ జపాన్ లో అందుబాటులో ఉండరని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ధ్రువీకరించడంతో ఈ మ్యాచ్ చుట్టూ నెలకొన్న అనవసర వివాదాలకు, నాటకీయతకు ముగింపు పడింది.
ముందస్తు కమిట్మెంట్లే కారణమన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్
ముందస్తుగా ఒప్పుకున్న ఇతర ముఖ్యమైన పనుల కారణంగానే మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తమ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్వర్ణ పతకం కోసం పోటీపడుతున్న భారత్, పాకిస్తాన్లతో పాటు కాంస్య పతక మ్యాచ్‌లలో తలపడుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు మొహ్సిన్ నఖ్వీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రత్యక్షంగా నగోయాలో లేకపోయినప్పటికీ.. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పతకాల ప్రదానోత్సవంపై వివాదాలు
మొహ్సిన్ నఖ్వీ హాజరుపై ఇంతటి చర్చ జరగడానికి గతంలో చోటుచేసుకున్న సంఘటనలే కారణం. 2025 పురుషుల ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. అదేవిధంగా 2026 మహిళల ఆసియా కప్‌లో కూడా భారత మహిళల ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయంలో మొహ్సిన్ నఖ్వీ నుంచి విజేత ట్రోఫీని తీసుకోవడానికి తిరస్కరించింది. ఈ రెండు ప్రధాన ఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధిస్తే పతకాల ప్రదానోత్సవంలో మళ్లీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఊపిరి పీల్చుకున్న నిర్వాహకులు
ప్రస్తుతం మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ మ్యాచ్‌కూ, పతకాల ప్రదానోత్సవానికీ హాజరు కావడం లేదని స్పష్టత రావడంతో ఆసియా క్రీడల నిర్వాహకులతో పాటు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. పతకాల బహూకరణ సమయంలో ఎలాంటి ప్రోటోకాల్ వివాదాలు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఇప్పుడు అందరి దృష్టి పతకాల వేదికపై కాకుండా కేవలం స్టేడియంలో జరిగే అసలు సిసలు భారత్-పాకిస్తాన్ క్రికెట్ సమరంపైనే నెలకొంది.
గోల్డ్ మెడల్ ఫైట్‌కు భారత్, పాకిస్తాన్ సిద్దం
రెండు జట్లూ అద్భుక ఫామ్‌తో ఆసియా గేమ్స్ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత జట్టు అలవోకగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా.. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించి పాకిస్తాన్ ఫైనల్ చేరింది. గతంలో హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సారి కూడా పాకిస్తాన్‌ను ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉంది.














Click it and Unblock the Notifications
