ఆ ఫిట్‌నెస్‌కు గ్రాండ్ స్లామ్ సలాం: 43 ఏళ్ల వయస్సులో
Rohan Bopanna: రోహన్ బొపన్న.. ఇండియన్ టెన్నిస్ స్టార్. రిటైర్ అయ్యే వయస్సులో చరిత్ర సృష్టించాడు. 43 సంవత్సరాల వయస్సులో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.
43 సంవత్సరాల వయస్సులో ఆస్ట్రేలియన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఈ ఘనతను అందుకున్నాడు వీర కన్నడిగుడు. వారిద్దరి జోడీకి ఇదే మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మెల్‌బోర్న్ పార్క్ రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన సైమన్ బొలెలి- ఆండ్రియా వవస్సోరి జోడీని ఓడించారు రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్. 7-6, 7-5 సెట్ల తేడాతో మట్టికరిపించారు. రెండు సెట్లల్లో 12 గేమ్‌ల వరకూ సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ ఇది.
గంటా 40 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌లో బొపన్న-ఎబ్డెన్‌తో సమానంగా పాయింట్లను సాధించారు సైమన్ బొలెలి- ఆండ్రియా వవస్సోరి. చివరి సెట్ వరకూ సమాన పాయింట్లను సాధించారు. తొలి సెట్ 13వ గేమ్‌లో 4-0 తేడాతో ఏడు పాయింట్ల టైబ్రేక్‌ను గెలుచుకున్నారు. దీనితో ఈ సెట్ వారి వశమైంది.
రెండో సెట్‌లోనూ భీకర పోరు సాగించారు. ఒక దశలో తొమ్మిదో గేమ్ ముగిసే సమయానికి బొలెలి-వవస్సోరి జోడీ 5-4తో ముందంజ వేసింది కూడా. 10వ గేమ్‌లో బొపన్న- ఎబ్డెన్ జోడీ విజృంభించింది. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో తడాఖా చూపింది. ఈ గేమ్‌ను గెలుచుకుని 5-5తో సమానంగా నిలిచింది.
నిర్ణయాత్మక 11వ గేమ్‌లో ప్రత్యర్థుల సర్వ్‌ను బ్రేక్ చేయడంతో 6-5తో ముందడుగు వేయగలిగింది. చిట్టచివరి 12వ గేమ్‌లోనూ ఇదే తీరును ప్రదర్శించారు. శక్తిమంతమైన గ్రౌండ్ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ గేమ్‌లో వారికి ఎదురు లేకపోయింది. వరుస పాయింట్లను నెగ్గారు. 7-5 తేడాతో రెండో సెట్‌ను గెలుచుకున్నారు.












Click it and Unblock the Notifications