కమ్మిన్స్ కాకాకు బిగ్ ఛాన్స్: ఇక్కడ పరువు ఎలాగూ పోయింది..అక్కడైనా నిలుపుతాడా?
Australia Squad WTC Final 2025: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ గడువు సమీపిస్తోంది. జూన్ 11వ తేదీన లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అడుగుపెట్టడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోయే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్ ఇది. గత ఏడాది శ్రీలంక, భారత్‌లల్లో పర్యటించిన జట్టునే ఇప్పుడు కూడా కొనసాగించినట్టు కనిపిస్తోంది. ఇందులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. శ్రీలంకను 2-1, భారత్‌ను 3-1తో మట్టికరిపించిన టీమ్ అది.

సర్జరీ కారణంగా కొంతకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటోన్న కామెరాన్ గ్రీన్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కింది. టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ మాట్ కుహ్నెమాన్ కూడా జట్టులో పునరాగమనం చేశాడు. బ్రెండన్ డాగెట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక అయ్యాడు. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో అదరగొట్టాడు డాగెట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీనితో అతన్ని రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా.
పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు అందుబాటులోకి వచ్చారు. గాయాల కారణంగా వాళ్లిద్దరూ కూడా శ్రీలంకతో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా వంద శాతం ఫిట్‌నెస్ సాధించారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ 2025 ఆడుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి ఆస్ట్రేలియా మొత్తం ఆడిన ఆరు సిరీస్‌లలో నాలుగింట్లో గెలిచింది. రెండింటిని డ్రా చేసుకుంది. 2023లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్, 2023-24 వెస్టిండీస్ సిరీస్ డ్రా అయింది. అత్యంత కీలకమైన భారత్‌తో సిరీస్‌లో విజయకేతనాన్ని ఎగురవేసింది ఆస్ట్రేలియా. 3-1 తేడాతో టీమిండియాను సొంతగడ్డపై ఓడించింది.
దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి. సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకిస్తాన్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే ఆస్ట్రేలియా జట్టులో- పాట్ కమిన్స్ (కేప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్ ఉన్నారు. బ్రెండన్ డాగెట్.. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్.












Click it and Unblock the Notifications