నీ పనైపోయిందిరా ఆజామూ..: స్కూల్ మూసేస్కో
పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా క్రికెట్ ప్రపంచంలో గుర్తింపు పొందిన స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ను కష్టాలు వీడట్లేదు. సుదీర్ఘకాలంగా వరుస వైఫల్యాలు వెంటాడుతూనే వస్తోన్నాయి. ఫామ్ ను అందిపుచ్చుకోవడంలో తడబడుతున్నాడు. ఓ మోస్తరు జట్ల పైనా ఆడలేక చేతులెత్తేస్తోన్నాడు.
తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లోనూ బాబర్ ఆజమ్ విఫలం అయ్యాడు. ఈ మూడు మ్యాచ్ లకు కలిపి అతను చేసిన పరుగులు.. 56. తొలి వన్డేలో 64 బంతుల్లో 47 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. దాన్ని కొనసాగించలేకపోయాడు. రెండో వన్డేలో మూడు బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.

చివరి వన్డేలోనూ అదే పరిస్థితి. తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. పెవిలియన్ చేరాడు. ఈ కాసిన్ని పరుగులు చేయడానిక్కూడా 23 బంతులను ఎదుర్కొనాల్సొచ్చిందతనికి. ఇప్పటివరకు 72 ఇన్నింగ్ లను ఆడిన బాబర్ ఆజమ్.. ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడంటే అతని ఫామ్ ఏ అథఃపాతాళానికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ బ్యాట్ నుంచి భారీగా పరుగులు జాలువారి 715 రోజులైంది.
ప్రస్తుతం పాకిస్తాన్.. వెస్టిండీస్ లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్ లల్లో చివరి మ్యాచ్ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. ఏ మాత్రం కూడా పోరాడలేకపోయింది. ఎంత ఘోరంగా ఆడిందంటే.. 92 పరుగులకే పాకిస్తాన్ జట్టు మొత్తం కొల్లాప్స్ అయింది. 30 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా ఒక్కడే టాప్ స్కోరర్ అంటే మిగిలిన వాళ్లు ఎంత దయనీయంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
ఒక దశలో 8 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. అయిదుమంది డకౌట్ అయ్యారీ మ్యాచ్ లో. ఓపెనర్లిద్దరిదీ అదే పరిస్థితి. బాబర్ ఆజమ్ గానీ, కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్ గానీ.. విండీస్ బౌలింగ్ ప్రతాపానికి ఎదురు నిలవలేకపోయారు. నిప్పులు చెరిగే బంతులకు తలవంచారు.
ఓపెనర్లు సయీమ్ అయూబ్-0, అబ్దుల్లా షఫిక్- 0, బాబర్ ఆజమ్- 9, కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్- 0.. ఇలా సాగింది టాప్ ఆర్డర్ బ్యాటింగ్. హసన్ రజా- 13, హుస్సేన్ తలత్- 1, మహ్మద్ నవాజ్- 23, నసీమ్ షా- 6, హసన్ అలీ-0, అబ్రార్ అహ్మద్- 0 (రనౌట్) చేతులెత్తేశారు.
వెస్టిండీస్ బౌలర్లల్లో జేడెన్ సీల్స్ చెలరేగాడు. 7.2 ఓవర్లల్లో 34 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు నేలకూల్చాడు. గుడకేష్ మోతీ- 2, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసుకున్నారు. 1991 తరువాత పాకిస్తాన్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం వెస్టిండీస్ కు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వెస్టిండీస్ కేప్టెన్ షై హోప్ సెంచరీతో చెలరేగాడీ మ్యాచ్ లో. 94 బంతుల్లో 10 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లతో 120 పరుగులు పిండుకున్నాడు. నాటౌట్ గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు కొట్టాడు.
ఈ విజయంతో వెస్టిండీస్ చరిత్ర సృష్టించినట్టయింది. 34 సంవత్సరాల పగను తీర్చుకున్నట్టయింది విండీస్ వీరులకు. 1991 తరువాత తరువాత పాకిస్తాన్ పై వెస్టిండీస్ ఓ వన్డే సిరీస్ ను గెలవడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications