గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్..?
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ లో భాగంగా ఆడుతుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినెపుకర్ క్రికెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే తోటి క్రీడాకారులతో పాటు సిబ్బంది అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో మహమ్మదన్ క్లబ్ కెప్టెన్‌గా ఉన్న తమీమ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా ఉన్నట్టుండి ఛాతీలో నొప్పితో బాధపడుతూ పడిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించి పరీక్షించగా స్వల్ప గుండెపోటుగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఢాకా తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.

కానీ హెలిప్యాడ్‌కు వెళ్తుండగానే తమీమ్ కు మరోసారి గుండెపోటు వచ్చింది. దాంతో తిరిగి మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమీమ్ ఆరోగ్య పరిస్థితి విషమం గానే ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేబాశీష్ వెల్లడించారు. తమీమ్ ఆరోగ్యంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సైతం ఆరా తీసినట్టు సమాచారం.
తమీమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది జనవరిలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చివరగా 2023లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ 243 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు నమోదు చేశారు. 70 టెస్టులు, 78 టీ20లు ఆడారు. ఆ తర్వాత నుంచి లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications