గంభీర్-అగార్కర్ కు బీసీసీఐ అత్యవసర పిలుపు..! రోకోపై తేల్చేస్తారా ?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇందులో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో భారత్ ను వైట్ వాష్ చేసేసింది. ఆ తర్వాత మొదలైన వన్డే సిరీస్ లో నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 3449 పరుగులు స్కోర్ చేసినా అపసోపాలు పడి 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో రెండో వన్డేకు ముందు హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో అత్యవసర భేటీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు వారిద్దరికీ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.
బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. ఈ లోపే గంభీర్, అగార్కర్ తో పాటు టీమ్ మేనేజ్ మెంట్ లో ఉన్న ఇతర అధికారుల్ని అత్యవసర విషయాలు చర్చించేందుకు రావాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో తాజాగా టీమ్ ఇండియా ప్రదర్శనలో స్థిరత్వం లోపించడం, సెలక్షన్ తప్పిదాలు, గ్రౌండ్ లో ఆటగాళ్ల మైండ్ సెట్ వంటి పలు అంశాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి తొలి వన్డేలో ఫామ్ లోకి వచ్చిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ భవిష్యత్తు తేల్చేందుకు బీసీసీఐ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ అత్యవసర భేటీలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొనబోతున్నారు. అయితే కొత్తగా బీసీసీఐ అధ్యక్షుడు అయిన మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది తేలలేదు. రెండో వన్డే జరిగే రోజే ఈ భేటీకి ప్లాన్ చేశారు. కాబట్టి ఇందులో కోహ్లీ, రోహిత్ ను పిలిచే అవకాశం లేదు. అయితే వీరి భవిష్యత్తుపై చర్చించే అవకాశముంది.

ఈ భేటీలో మ్యాచ్ లకు ఆటగాళ్ల సెలక్షన్ లో స్థిరత్వం ఉండేలా చూసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలిక వ్యూహాలపై చర్చించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తాజాగా టెస్టు సిరీస్ ను దారుణంగా కోల్పోవడం, అందుకు దారితీసిన కారణాలపైనా చర్చిస్తారు. దీనిపై గంభీర్, అగార్కర్ ఫీడ్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉంది. స్వదేశంలో జరిగే టెస్ట్ సీజన్‌లో మైదానంలో, బయట కూడా వీరి వ్యూహాలు గందరగోళంగా ఉన్నాయని బీసీసీఐ భావిస్తోంది. అందుకే వీరి నుంచి తదురి ప్రణాళికలపై స్పష్టత తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే టెస్టుల్లో కొహ్లీని మళ్లీ తీసుకొచ్చే విషయంపైనా చర్చిస్తారు.












Click it and Unblock the Notifications