హామీలే తప్ప సాయం లేదు.. ప్రపంచకప్ విజేతల కన్నీటి కథ!
భారత్ తరఫున అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ.. ఆ విజేతలు ఇంకా ఇళ్ల స్థలాలు, ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టుకు దీపికా కెప్టెన్ గా వ్యవహరించి విజయాన్ని అందించారు. ప్రపంచకప్ గెలుచుకుని ఏడాది గడుస్తున్నా, నాయకులు, అధికారులు తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను నిలబెట్టుకోలేదని దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం, ప్రభుత్వం నుంచి రోజువారీ జీవితంలో తగిన మద్దతు లభించడం లేదని క్రీడాకారిణులు వాపోతున్నారు. స్థానికంగా మైదానాలు, ఫిట్‌నెస్ గైడెన్స్ కరువవ్వగా.. పెద్ద నగరాల్లో శిక్షణ పొందే ఆర్థిక స్థోమత వారికి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు ఇస్తామన బహిరంగ సభల్లో గొప్పలు చెప్పే నాయకులు, ఆచరణలో మాత్రం శ్రద్ధ చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన దీపిక మాట్లాడుతూ.. తమకున్న దృష్టి లోపం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులను ఫాలో అప్ చేయలేమని, ప్రభుత్వమే స్వయంగా స్పందించి తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కోరారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన మరో క్రీడాకారిణి పాంగి కరుణాకుమారి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన సిము దాస్, సుష్మా పటేల్, దుర్గ యెవ్లే, జమున రాణి, అనిఖా దేవి, కావ్య ఎన్.ఆర్ వంటి పలువురు క్రీడాకారిణులు కూడా ప్రభుత్వాల నుంచి తగిన సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రీడాకారిణులందరి వయసు 16 నుంచి 28 ఏళ్ల మధ్యే ఉండగా.. వీరిలో ఎక్కువ మంది పేద గ్రామీణ కుటుంబాల నుంచే వచ్చారని జట్టు మేనేజర్ వెల్లడించారు. అంధుల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి క్రీడాకారిణులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నప్పటికీ.. కోచింగ్, ఫిట్‌నెస్, ఆహారం, ప్రయాణాల కోసం నిధుల కొరత వేధిస్తోంది.
ఈ తరుణంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వీరికోసం ముందుకు రావడం ఊరటనిచ్చిందియ విశాఖపట్నం జిల్లా మంగళపాలెంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామ్, డైరెక్టర్ కిరణ్‌లు ప్రతి క్రీడాకారిణికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.50,000 అందజేశారు.
డిసెంబర్లో ఢిల్లీలో నేపాల్‌తో జరగనున్న తదుపరి సిరీస్ కు ముందు ఈ ఆర్థిక సహాయం క్రీడాకారిణుల మనోధైర్యాన్ని పెంచుతుందని జట్టు మేనేజర్, కోచ్ శిఖా శెట్టి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణులకు ప్రత్యేక మద్దతు అందించాలని ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్ బాబు ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కోరారు.














Click it and Unblock the Notifications
