అందుకే బుమ్రాను తీసుకోలేదు- గిల్: శివం దుబే కూడా అవుట్: ఏకంగా మూడు మార్పులు
ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ డిసైడర్ కు దూరం అయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ కు ఎదురుదెబ్బే. సిరీస్ సొంతం కావాలంటే గెలిచి తీరాల్సని మ్యాచ్ ఇది.
కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా గాయపడ్డాడు. అతని ఎడమ మోకాలికి బలంగా దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ గాయం కారణంగా అతని మోకాలిపై వాపు రావడంతో మూడో వన్డేకు అతను అందుబాటులో లేకుండా పోయాడని స్పష్టం చేసింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేదు బుమ్రా. తొలి వన్డేలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో వన్డేలోనూ 45 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇది అతని స్థాయి ప్రదర్శన కాదు.

ఈ మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లూ 1-1తో సమవుజ్జీగా నిలిచాయి. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. బుమ్రాతో పాటు శివమ్ దూబే జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో అనారోగ్యం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. బుమ్రాకు బదులుగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్‌కు కూడా అవకాశం లభించింది.
రెండో వన్డేలో రాహుల్ స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ వన్డేకు దూరమయ్యాడు. అతని స్థానంలో హర్ష్ దూబేను జట్టులోకి తీసుకున్నప్పటికీ, మేనేజ్‌మెంట్ అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. లార్డ్స్ మైదానంలో స్పిన్నర్ల కంటే పేసర్లకే ఆధిపత్యం ఉంటుందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
అందుకే కుల్దీప్ యాదవ్ లేదా హర్ష్ దూబే వైపు మొగ్గు చూపకుండా, నలుగురు ప్రధాన వేగవంతమైన బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ నిర్ణయించుకున్నట్లు వివరించాడు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు ఇదే మొదటి మ్యాచ్. మేనేజ్‌మెంట్ గణాంకాల ఆధారంగా కాకుండా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయగల నైపుణ్యం ఉండటం వల్లే అతన్ని ఎంపిక చేసినట్లు గిల్ పేర్కొన్నాడు.
లార్డ్స్ లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వ్యూహంతోనే ఈ కీలక మార్పు చేసినట్లు వివరించాడు. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడిన బౌలర్ సాకిబ్ మహమూద్ స్థానంలో జోష్ టంగ్‌ను జట్టులోకి తీసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బెన్ డకెట్, జాకబ్ బెథెల్ ఇన్నింగ్ ఆరంభించారు.












Click it and Unblock the Notifications