వినేష్ ఫొగట్ కేసు.. అనూహ్యంగా
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఉదంతం అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌కు చేరింది. అనర్హత వేటుపై వాదనలను ఈ న్యాయస్థానం ఆలకించింది.
భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, మరో సీనియర్ న్యాయవాది విదూష్ పత్ సింఘానియా తమ వాదనలను వినిపించారు. వీడియో కాన్ఫరెన్స్ వినేష్ ఫొగట్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రతినిధులు ఈ విచారణకు హాజరయ్యారు.

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్..ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో కొనసాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో వివాదాలను పరిష్కరించడానికి 1984లో ఏర్పాటైన కోర్టు ఇది. ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పారిస్‌లో తాత్కాలికంగా ఈ అడ్‌హక్ కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడే వినేష్ ఫొగట్ కేసు వాదనలు పూర్తయ్యాయి.
వారి వాదనలను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్ ఆలకించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించారు.
అనంతరం తన తుది తీర్పును వాయిదా వేశారు. ఆగస్టు 13వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు తుది తీర్పు వెలువడించనున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి తుది తీర్పు శనివారం రాత్రి 9:30 గంటలకు వెలువడుతుందని అంచనా వేశారు. అనూహ్యంగా తీర్పు 13వ తేదీకి వాయిదా పడింది.
మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గురయ్యారు.












Click it and Unblock the Notifications