ఖేల్ రత్న అవార్డులు వీరికే- ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టిన కేంద్రం..!!
Khel Ratna Awards 2024: కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఇవి. మొత్తం నలుగురు క్రీడాకారుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన వారికి ఈ పురస్కారాలను అందజేస్తుంది.
దేశంలో వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు ప్రతి సంవత్సరం ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరిట ఈ పురస్కారాలు వారికి అందుతుండేవి.

2021 ఆగస్టు 6వ తేదీన దీని పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. రాజీవ్ గాంధీ స్థానంలో ప్రముఖ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ పేరును పెట్టింది. ఈ అవార్డుకు అర్హత గల క్రీడాకారుల పేర్లతో కూడిన జాబితాను నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంటుంది. 2023లో బ్యాడ్మింటన్ ప్లేయర్లు చిరాగ్ షెట్టి, సాత్విక్ రంకిరెడ్డి ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.
2024లో నలుగురు ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు- ఛెస్, హర్మన్ ప్రీత్ సింగ్- హాకీ, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, మను భాకర్- షూటంగ్.. ఆ జాబితాలో ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నలుగురూ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదు, పతకం, ప్రశంసాపత్రం లభిస్తుంది.
గత ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిశారు మను భాకర్. షూటింగ్‌లో రెండు మెడల్స్ అందుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ కేటగిరీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
అలాగే- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ కేటగిరీలో తోటి షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని ముద్దాడారు. ఖేల్ రత్న అవార్డు విషయంలో ఆమెకు అన్యాయం జరిగిందటూ ఇటీవలే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆమెను నామినేషన్ చేయలేదనే వివాదం వెలుగులోకి వచ్చింది. తన దేశం కోసం ఆడటం తనకు గొప్ప అని, నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన తరఫున పొరపాటు జరిగిందంటూ చెప్పారప్పట్లో.












Click it and Unblock the Notifications