పాక్‌లో అల్లకల్లోలం- ఛాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం
Champions Trophy 2025: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమౌతోన్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కావాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ ఢీ కొట్టాల్సి ఉంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి.

భారత్ అంగీకరించట్లేదు..
ఈ దఫా ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో ఆయా మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ అయ్యాయి కూడా. పాకిస్తాన్‌తో దశాబ్దాల కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి భారత్ అంగీకరించట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి జట్టును పాకిస్తాన్ పంపించడానికి ససేమిరా అంటోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే..
భారత్ వంటి బలమైన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారీగా నష్టపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. స్పాన్సరర్స్ పెద్దగా ముందుకు రారు. క్రికెట్‌ను ఆరాధించే కోట్లాదిమంది భారత అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ చూడ్డానికీ పెద్దగా ఆసక్తి చూపరు.
హైబ్రిడ్ మోడల్‌లో..
వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలను రూపొందించింది ఐసీసీ. కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో, భారత్ తలపడబోయే గేమ్‌లన్నింటినీ కూడా శ్రీలంక లేదా తటస్థ వేదిక దుబాయ్‌లల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. దీనికి పాకిస్తాన్ అంగీకరించట్లేదు. స్వదేశంలో నిర్వహించాలనీ పట్టుబట్టుతోంది.
టియర్ గ్యాస్ ప్రయోగాలు, లాఠీఛార్జీలు..
అదే సమయంలో పాకిస్తాన్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సైతం హైబ్రిడ్ మోడల్‌ను సమర్థించేలా ఉంటోన్నాయి. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్- ఇ- తెహ్రీక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజధాని ఇస్లామాబాద్‌ను ముట్టడించారు. టియర్ గ్యాస్ ప్రయోగాలు, లాఠీఛార్జీలు పెద్ద ఎత్తున సాగుతున్నాయక్కడ.
29వ తేదీన ఐసీసీ భేటీ
ఈ పరిణామాల మధ్య ఈ నెల 29వ తేదీన భేటీ కాబోతోంది ఐసీసీ. వర్చువల్ విధానంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఓ నిర్ణయానికి కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నచ్చజెప్పి, ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని తీర్మానించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications