వారి ప్రతిభకు చంద్రబాబు టేక్ ఎ బోవ్..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, ఫైనల్ లో అడుగు పెట్టింది. ఆ జట్టు నిర్దేశించిన అతి భారీ లక్ష్యాన్ని కొట్టి అవతలపడేసింది. 300, అంతకంటే ఎక్కువ స్కోర్ ను ఛేదించిన మొట్టమొదటి మహిళ జట్టుగా రికార్డు నెలకొల్పింది. అసాధారణ ప్రదర్శనతో అద్వితీయమైన విజయాన్ని అందుకుంది.. హర్మన్‌సేన. టైటిల్‌కు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్.. సెంచరీతో కదం తొక్కారు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ విధ్వంసకర చేశారు. సెంచరీతో చెలరేగారు. 119 పరుగులు చేశారు. ఎల్లిస్ పెర్రీ- 77, అష్లే గార్డ్‌నర్- 63 హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్ కు ఒక్కో వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలోనే అయిదు మాత్రమే కోల్పోయి 341 పరుగులతో విజయదుందుభి మోగించింది. జెమీమా రోడ్రిగ్స్ అదరగొట్టారు. 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్ గా నిలిచారు. అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. కేప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అదే స్థాయిలో దుమ్ము దులిపారు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు చేశారు. జెమీమా ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
షెఫాలీ వర్మ- 10, స్మృతి మంధాన నిరాశపరిచారు. వారిద్దరు అవుట్ అయ్యాక బ్యాటింగ్ కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్.. చెలరేగారు. బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలనా కింగ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అలీసా హీలీ నేలపాలు చేసింది. ఈ అవకాశంతో జెమీమా చెలరేగింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం వేగంగా పరుగులు రాబట్టారు. సెంచరీ దిశగా సాగిన ఆమెను సదర్లాండ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన దీప్తి శర్మ దూకుడు ఆడినప్పటికీ ఎక్కువ సేపు నిల్చోలేకపోయారు. రనౌట్ అయ్యారు. రిచా ఘోష్ తో కలిసి జెమీమా భారీ ఇన్నింగ్ నెలకొల్పారు. 106 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన మరో సునాయస క్యాచ్‌ను మెక్‌గ్రాత్ నేలపాలు చేసింది. చివర్లో అమన్ జోత్‌తో కలిసి జెమీమా విజయం కోసం పోరాడారు. జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఫైనల్ చేరిన టీమిండియాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మహిళల వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి, ఫైనల్స్‌కు దూసుకెళ్లిందని ప్రశంసించారు.ఈ విజయం పట్ల దేశమంతా గర్విస్తుందని అన్నారు. జైమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల ఆటతీరును ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో 300లకు పైగా పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో వారిద్దరూ తమ కెరీర్‌లోనే అత్యుత్తమమైన ఆటను ప్రదర్శించారని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల క్రికెట్ జట్టు మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. "కీప్ గన్నింగ్ ఫర్ గ్లోరీ- వీ ఆర్ చీరింగ్ ఫర్ యు ఆల్ అంటూ వారిని ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications