ఆ వెటరన్ హీరోకు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్- తెగిన సుదీర్ఘ బంధం
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ లో మరో బిగ్ వికెట్ పడింది. హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అపాయింట్ అయిన తర్వాత భారీ ప్రక్షాళనకు మలి అడుగు పడింది. ఇదివరకే బౌలింగ్ కోచ్ గా ఎరిక్ సన్ స్థానంలో మోహిత్ శర్మ నియమితుడయ్యాడు. ఇప్పుడు మరొకరు ఈ ఫ్రాంఛైజీకి గుడ్ బై చెప్పారు. ఫ్రాంఛైజీతో 15 సంవత్సరాల పాటు కొనసాగిన బంధానికి వీడ్కోలు పలికారు. కాంట్రాక్ట్ గడువు ముగియడంతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అతనే.. మైకెల్ హస్సీ.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును మరింత బలోపేతం చేయడంలో భాగంగా తన చిరకాల మిత్రుడు, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ హస్సీని ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించే దిశగా పావులు కదుపుతున్నాడు. ఫ్లెమింగ్ నుంచి తనకు ఆఫర్ అందిందని హస్సీ గతంలోనే స్వయంగా వెల్లడించాడు కూడా.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు విడదీయరాని బంధం ఉంది. 15 ఏళ్లుగా వీరిద్దరూ ఆ జట్టులో సహచర ఆటగాళ్లుగా, ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్ కొనసాగారు. అత్యధికంగా ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న జట్లల్లో ఒకటిగా నిలిపారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అయిదుసార్లు చొప్పున ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో టైటిల్ గెలిచిన జట్టు మరొకటి లేదు.
ఈ బాండింగ్ వల్లే ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగ బాధ్యతలను హస్సీకి అప్పగించాలని అనుకుంటున్నాడు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోన్నానని హస్సీ తెలిపాడు. యాషెస్ సిరీస్ నాటికి జట్టును అన్ని విధాలుగా రాటు దేల్చేలా చేయాలని ఫ్లెమింగ్ భావిస్తోన్నాడని, ఇందులో భాగంగా బ్యాటింగ్ కోచ్ గా తనను తీసుకోవాలనే ప్రతిపాదన పెట్టాడని చెప్పాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ హస్సీ ఇంగ్లాండ్ జట్టుకు కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. ఆ జట్టు విజయంలో భాగం అయ్యాడు.
అది వాస్తవ రూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తాజాగా మైక్ హస్సీ వైదొలిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో పాటు అభిమానులతోనూ ప్రత్యేక అనుబంధం ఉందతనికి. మొదట ఆటగాడిగా, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించాడు. 2018 సీజన్‌లో జట్టు బ్యాటింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి చెన్నై సాధించిన పలు ఐపీఎల్ టైటిళ్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ కూడా వైదొలగొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌లో వెల్ష్ ఫైర్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న హస్సీకి అంతర్జాతీయ స్థాయిలో ప్లేయర్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఫ్లెమింగ్- హస్సీ ద్వయం అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచింది. ఇప్పుడది ఇంగ్లాండ్ లో తెరమీదికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. హస్సీ స్థానంలో సీఎస్కే నూతన బ్యాటింగ్ కోచ్‌గా ఎవరిని నియమిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications
