ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ కు ఓ శాంతి పురస్కారం..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడలో ఎట్టకేలకు ఓ శాంతి పురస్కారం వాలింది. 2026 ప్రపంచ కప్ డ్రా కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్‌లో జరిగిన ఒక వేడుకలో తొలి FIFA శాంతి బహుమతి లభించింది. టోర్నమెంట్ గ్రూపులకు జట్లను కేటాయించడానికి కొద్దిసేపటి ముందు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషికి గుర్తింపు ఈ అవార్డును అందజేస్తోన్నట్లు జియాని తెలిపారు.
కిందటి నెలలో ఈ శాంతి బహుమతిని ఆవిష్కరించింది ఫీఫా. శాంతి స్థాపన కోసం అసాధారణమైన, విశిష్టమైన చర్యలు తీసుకున్న వ్యక్తులు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిన వారిని ఈ శాంతి పురస్కారంతో సత్కరిస్తామని అప్పట్లో ప్రకటించింది. ఫీఫా వరల్డ్ కప్ డ్రా కార్యక్రమం సందర్భంగా దీన్ని వారికి ప్రదానం చేస్తామని వెల్లడించింది. దీనికి అనుగుణంగా- తొలి ఏడాది ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ కు ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. తన జీవితంలో ఇప్పటివరకు లభించిన అన్ని అవార్డుల కంటే ఇది అత్యుత్తమమైనదని, తనకు దక్కిన గొప్ప గౌరవాలలో ఒకటి అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడామని, ఆ చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు తనకు దక్కడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మేలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించడంతో సహా అనేక యుద్ధాలను ముగించానని ఆయన పునరుద్ఘాటించారు.
తాను జోక్యం చేసుకుని శాంతియుతంగా యుద్ధాలను ముగించిన విషయాలను డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనేక విభిన్న యుద్ధాలు జరిగాయని గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో, అవి ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు, అవి ప్రారంభం కావడానికి ముందే.. ముగించానని అన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని భావించిన ఇంకొన్ని యుద్ధాలను సైతం ఆపివేయగలిగామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన భారత్-పాకిస్తాన్ గురించి వివరించారు.
తాను అధికారం చేపట్టక ముందు అమెరికాలో పరిస్థితులు బాగాలేవని, ఇప్పుడు ప్రపంచంలోనే హాటెస్ట్ దేశంగా మారిందని అన్నారు. తనకు బహుమతులు అవసరం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెప్పారు. అవార్డు ప్రదానానికి ముందు ఓ వీడియోను ప్రదర్శించారు. గాజా సంక్షోభ పరిష్కారం సహా రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ట్రంప్ పోషించిన పాత్రను ఇందులో చూపారు.












Click it and Unblock the Notifications