గ్లెన్ ఫిలిప్స్ పిడుగులు: టీమిండియా ముందు కొండంత టార్గెట్
భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. ఆక్లాండ్ ఈడెన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల కొండంత స్కోరు నమోదు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. దీంతో టీమిండియా ముందు 260 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. గ్రౌండ్ చిన్నది కావడం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ఫిలిప్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కూడా ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 250కి పైగా స్కోర్ నమోదైంది. రికార్డ్ స్కోర్ సాధించింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ సీఫెర్ట్ వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. ఏ మాత్రం తొణకలేదు న్యూజిలాండ్. మూడు పరుగులు మాత్రమే చేసిన సిఫెర్ట్.. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయినా న్యూజిలాండ్ జోరుకు అడ్డుకట్ట పడలేదు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 9 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికే న్యూజిలాండ్ భారీ స్కోరుకు గట్టి పునాది పడింది.
ఆ తర్వాత స్టేడియంలో గ్లెన్ ఫిలిప్స్ షో మొదలైంది. ఫిలిప్స్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు సాధించి భారత్‌కు చుక్కలు చూపించాడు. అతనికి జతకలిసిన మైకేల్ బ్రేస్‌వెల్ మరింత విధ్వంసం సృష్టించాడు. బ్రేస్‌వెల్ 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు బాదాడు. గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి కివీస్ రన్ రేట్ నిమిష నిమిషానికి కొండలా పెరిగిపోయింది.
టీమిండియాలో ఒక్క మయాంక్ యాదవ్ మాత్రమే ఫర్వాలేదనిపించుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నితీష్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ఒక్ో వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో టీమిండియా తడబాటు ప్రదర్శిస్తోంది. మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ నాలుగు పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు కూడా జాకబ్ డఫీ ఖాతాలో పడ్డాయి. మొదటి ఓవర్ రెండు, అయిదు బంతులకు వీరిద్దరిని బలి తీసుకున్నాడు డఫీ.














Click it and Unblock the Notifications
