ఐయామ్ ష్యూర్.. కప్ కొట్టేది ఆ జట్టే
IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.
ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.
ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.
కాగా- ఐపీఎల్ 2025 ఫైనల్ పై దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ స్టార్ బ్యాటర్ హెర్ష్ లె గిబ్స్ తన అంచనాలను వెల్లడించాడు. రాయల్ ఛాలెంజర్స్ ఈ సీజన్ ఛాంపియన్ గా నిలుస్తుందని పేర్కొన్నాడు. విజేతగా ఆవిర్భవించడానికి ఆ జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు.
ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీకే విజయం దక్కుతుందని పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసినా లేదా ఫీల్డింగ్ ఎంచుకున్నా.. పంజాబ్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ ఓడించి తీరాల్సి ఉంటుందని, ఆ సామర్థ్యం జట్టుకు ఉందని అన్నాడు. క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆర్సీబీ వైపు ఉంటారని చెప్పాడు.
ప్రతి సీజన్ లో కూడా ఆర్సీబీ ఎంతగానో కష్టపడుతోందని, ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి చిట్టచివరి అడ్డంకిని అవలీలగా అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు గిబ్స్ చెప్పాడు. పంజాబ్ కింగ్స్ అంత త్వరగా ఆర్సీబీకి లొంగకపోవచ్చని, హోరాహోరీ పోరు ఖాయమనీ అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications