జాక్‌పాట్ కొట్టిన జై షా: ఏకగ్రీవ ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండో విడత నియమితులయ్యారు. ఈ సారి ఆయన నియామకం ఏకగ్రీవమైంది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను మరో దఫా ఛైర్మన్‌గా కొనసాగించడానికి ప్రతిపాదించారు. దీనికి బోర్డు సభ్యలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఐసీసీ సభ్య దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు తెలిపాయి. ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను విస్తరించడం, అభిమానుల సంఖ్యను పెంచడం, కమర్షియల్ గా అటు ఐసీసీ, ఇతర బోర్డులను మరింత బలోపేతం చేసేలా ద్వైపాక్షిక, ముక్కోణపు సిరీస్ లను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోన్నందున ఐసీసీ బోర్డ డైరెక్టర్లు మరోసారి జై షా కే పట్టం కట్టారు. ఆయన పునర్నియామకం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో వ్యూహాత్మక స్థిరత్వం లభిస్తుందని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది.

రాబోయే కాలంలో మహిళల క్రికెట్‌ను మరింత విస్తరించడం, అసోసియేట్ సభ్య దేశాలకు విస్తృత అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ మ్యాచ్ ల ప్రాధాన్యతలు.. వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని జై షాను ఛైర్మన్ గా రెండో విడత ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలిపారు. క్రికెట్ ను నూతన దేశాలకు విస్తరింపజేయడంలో జై షా కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. భాగస్వామ్య దేశాల పాత్ర ఎంతో కీలకమైనదని వ్యాఖ్యానించారు.
ప్రధాన టోర్నమెంట్ల ప్రసార హక్కులు, డిజిటలైజేషన్, మరిన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లను ఐసీసీ స్పాన్సర్ షిప్ ల పరిధిలోకి తీసుకుని రావడం, ప్రపంచ స్థాయిలో నూతన క్రీడాకారులను గుర్తించే మార్గాలను సుగమం చేయడంలో జై షా ఓ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారని, దీన్ని యధాతథంగా అమలు చేయడానికి ఆయన నాయకత్వం అవసరమౌతుందని భావించినట్లు చెప్పారు. దీనివల్ల సాంప్రదాయ క్రికెట్ ప్రాభవం తగ్గకుండా చూస్తూనే, ఆధునిక క్రీడా మార్కెట్‌లో కొత్త అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుందని అన్నారు.
మరోసారి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంపై జై షా స్పందించారు. బోర్డు సభ్యులు, డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2028 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ భాగం కావడం క్రీడా చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నారు. ఒలింపిక్స్ ద్వారా యువ క్రీడాకారులకు క్రికెట్‌ను మరింత చేరువ చేసే గొప్ప అవకాశం లభించిందని చెప్పారు. ఈవెంట్లను నిర్వహించడమే కాకుండా క్రికెట్ కు సుస్థిర భవిష్యత్తును అందించడమే తన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
ఈ నియామకాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సహా పలువురు ప్రతినిధులు స్వాగతించారు. మారుతున్న అంతర్జాతీయ క్రీడా శైలికి అనుగుణంగా ద్వైపాక్షిక పోటీల ప్రాధాన్యతను కాపాడటం, అంతర్జాతీయ క్యాలెండర్‌ను సమర్థంగా నిర్వహించడం అవసరమని థాంప్సన్ వ్యాఖ్యానించారు. సాంప్రదాయ క్రీడా విలువలను కాపాడుకుంటూనే, నూతన మార్కెట్లను ఒడిసిపట్టుకోవడం ద్వారా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు.
మహిళల క్రికెట్ విస్తరణ, అసోసియేట్ దేశాల పురోగతికి జై షా అందిస్తోన్న నాయకత్వం ఎంతో కీలకమని ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ రోస్ రివాజ్, అసోసియేట్ మెంబర్ ఛైర్మన్ గురుమూర్తి పళని అన్నారు. చిన్న దేశాలకు అంతర్జాతీయ పోటీల్లో ఎక్కువ అవకాశాలు, మౌలిక వసతులు కల్పించడం వల్ల క్రీడా మూలాలు బలోపేతం అవుతాయని వ్యాఖ్యానించారు. మహిళా క్రికెటర్లకు అన్ని రీజియన్లల్లో సరైన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
