లైన్ క్రాస్ చేశారు..: యశస్వి జైస్వాల్ పై దెబ్బేసిన ఐసీసీ
కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు చోటు చేసుకున్న హైడ్రామాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చెక్ పెట్టింది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండోకు షాక్ ఇచ్చింది. వీరిద్దరూ గొడవ పడటాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది.
మ్యాచ్ మొదటి రోజు వరుస ఫోర్లతో దూకుడు మీద కనిపించిన జైస్వాల్.. అర్ధశతకం సాధించే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండొ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది.

ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో ఫెర్నాండొ వేసిన మొదటి మూడు బంతులను జైస్వాల్ వరుసగా బౌండరీలకు తరలించి, దూకుడు మీద కనిపించాడు. అదే ఓవర్ చివరి బంతికి ఫెర్నాండొ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రౌండ్ ది వికెట్ లో సంధించిన గుడ్ లెంగ్త్ డెలివరీకి జైస్వాల్ బలి అయ్యాడు. ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంగా పిచ్ అయి దూసుకొచ్చిన బంతిని జైస్వాల్ ఆఫ్ సైడ్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు గానీ సాధ్యపడలేదు. బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ నేరుగా వికెట్లను తాకింది.
వికెట్ తీసిన ఆనందంలో శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండొ చాలా దూకుడుగా సంబరాలు చేసుకుంటూ, జైస్వాల్ వైపు చూసి పెవిలియన్ వెళ్లాలంటూ సైగలు చేశాడు. దీనిపై జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తోన్న అతను వెనక్కి తిరిగి ఫెర్నాండొ వైపు దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరింది. అదే సమయంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపించారు.
ఈ గొడవ నేపథ్యంలో ఐసీసీ కొరడా ఝుళిపించింది. కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 నిబంధనను ఈ ఇద్దరూ ఉల్లంఘించినట్లు మ్యాచ్ రెఫరీ తేల్చారు. మ్యాచ్ సాగుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్ళు, అంపైర్లు లేదా సహాయక సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించినా, ఉద్దేశపూర్వకంగా నెట్టడం వంటివి చేసినా ఈ ఆర్టికల్ ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో ఐసీసీ.. ఇద్దరిపైనా జరిమానాలను విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. ఈ ఇద్దరి ఖాతాల్లో చెరొక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.














Click it and Unblock the Notifications