ఆస్ట్రేలియాతో రెండో టీ20: భారత్ తుదిజట్టులో..
తిరువనంతపురం: భారత్- ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్, ఆసీస్‌కు మాథ్యూ వేడ్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.
విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. అయిదు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 208 పరుగుల భారీ స్కోర్‌ను కొట్టి అవతల పడేసింది భారత్. ఇంకో బంతి మిగిలివుండగానే 209 పరుగులు చేసింది.

అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది భారత్. తుదిజట్టులో పెద్దగా మార్పులు చేర్పులకు పూనుకోకపోవచ్చు. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే అది బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండొచ్చు. తొలి టీ20లో బౌలర్లు విఫలమైన నేపథ్యంలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి, స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో తీసుకోవడానికి అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితే ఎదురైతే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టొచ్చు. అతని స్థానంలో శివమ్ దుబేకు జట్టులో చోటు దక్కుతుంది. శివమ్ దుబేను వద్దనుకుంటే వాషింగ్టన్ సుందర్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. పిచ్ ఆధారంగా ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అటు ఆస్ట్రేలియా దెబ్బతిన్న పులిలా ఉంది. తొలి మ్యాచ్‌లో 208 పరుగులను కూడా కాపాడుకోలేకపోయిందా జట్టు. ఫలితంగా ఇందులోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న నేపథ్యంలో- దాని జోలికి వెళ్లకపోవచ్చు. బౌలర్ తన్వీర్ సంఘాకు బదులుగా కొత్త ముఖం ఆరోన్ హార్డీ లేదా కేన్ రిచర్డ్‌సన్‌ను తుదిజట్టులో తీసుకోవచ్చు.
భారత్ తుదిజట్టులో- యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/వాషింగ్టన్ సుందర్/శివమ్ దుబే, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియా తుదిజట్టులో- స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోస్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, మాథ్యూ వేడ్ (కెప్టెన్ వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ/కేన్ రిచర్డ్‌సన్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications