ఆసీస్ టీమ్‌లో బాహుబలి బౌలర్: 6.7 అడుగుల హైట్: భారత్‌పై అరంగేట్రం
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్- వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లల్లో 2-1తో వెనుకంజలో ఉంది. ప్రత్యేకించి- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముగిసిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అవమానకర ఓటమిని చవి చూడాల్సొచ్చింది.
ఈ బీజీటీ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియగా.. నాలుగో దాంట్లో మళ్లీ పాత పాటే పాడింది. పరాజయాలకు అలవాటు పడ్డామనే విషయాన్ని బహిర్గతం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వంటి కొమ్ములు తిరిగిన బ్యాటర్లు సైతం మట్టికరిచారీ గేమ్‌లో.

ఈ పరిస్థితుల మధ్య చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతోంది భారత్. జనవరి 3వ తేదీన ఆరంభం కానుందీ గేమ్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఇందులో గెలిస్తే గానీ సిరీస్ సమం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో భారత్ విజయకేతనం ఎగురవేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. మెల్‌బోర్న్ నుంచి ఇప్పటికే సిడ్నీకి చేరుకుంది జట్టు. నెట్ సెషన్స్‌లో పాల్గొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోంది. జట్టు ప్లేయర్లందరూ అందుబాటులో ఉన్నారు. కఠోరంగా శ్రమిస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో భారత్‌పై ఆడబోయే తుదిజట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. మిఛెల్ మార్ష్‌కు ఉద్వాసన పలికింది క్రికెట్ ఆస్ట్రేలియా అతని స్థానంలో కొత్త ప్లేయర్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చింది. అతని పేరు బ్యూ వెబ్‌స్టర్. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతనికి చోటు దక్కిందీ టీమ్‌లో.
టాస్మానియాలోని హోబర్ట్‌కు చెందిన క్రికెటర్ వెబ్‌స్టర్. ఆరడుగుల ఆజానుబాహుడు. అతని ఎత్తు 6 అడుగుల 7 అంగుళాలు. బౌలింగ్ ఆల్‌రౌండర్. డొమెస్టిక్ క్రికెట్‌లో టాస్మానియా తరఫున 2013-14 సీజన్‌లో అడుగుపెట్టాడు. నిలకడగా రాణిస్తోన్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. బ్యాట్ అండ్ బాల్‌తో మెరుపులు మెరిపిస్తోన్నాడు.
భారత్‌పై ఆడబోయే తుదిజట్టులో- సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నుస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications