భారత్‌కు కనీసం ఆ అదృష్టం దక్కలేదు: రేసు నుంచి అవుట్: ఆసీస్ ఇన్..!!
WTC 2025: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఆరు వికెట్ల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్‌లో ఈ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా గెలిచింది. మూడో గేమ్ డ్రా కాగా.. మిగిలిన మూడింట్లో ఆస్ట్రేలియా విజయకేతనాన్ని ఎగురవేసింది.
గెలవడానికి 162 పరుగులు చేయాల్సిన దశలో వెంటవెంటనే నాలుగు వికెట్లను కూల్చారు బౌలర్లు. ఆస్ట్రేలియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగారు. ఆ తరువాత పట్టు సడలింది. మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, కొత్త ప్లేయర్ బ్యు వెబ్‌స్టర్ క్రీజ్‌లో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.

దీనితో రెండో ఇన్నింగ్ తొలి సెషన్ ప్రారంభంలో ఉన్న ధీమా ఆ తరువాత సన్నగిల్లుతూ వచ్చింది. మూడు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ ఆ తరువాత చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఒత్తిడికి లోనయ్యాడు. మరో ఎండ్‌లో అతనికి సహకరించే బౌలర్లు లేకపోవడం మైనస్ పాయింట్ అయింది.
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్, మార్నుస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ ఖాతాలోనే పడ్డాయి. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తరువాత వికెట్ల పతనానికి బ్రేక్ పడింది. క్రీజ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిిప్ ఫైనల్స్ 2025 రేసు నుంచి వైదొలగింది భారత్. ఇప్పటివరకు రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగ్గా ఈ రెండుసార్లు కూడా ఫైనలిస్ట్‌గా నిలిచింది టీమిండియా. ఫైనల్స్ మాత్రం గెలవలేకపోయింది. ఈ సారి కనీసం ఆ అదృష్టానికి కూడా నోచుకోలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2021లో సౌతాంప్టన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచింది. 2023లో కూడా ఫైనల్స్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని చవి చూడాల్సొచ్చింది. ఇప్పుడు ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది టీమిండియా.
భారత్ స్థానంలో ఆస్ట్రేలియా ఫైనల్స్ చేరుకుంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. 2025 జూన్ 11వ తేదీన లండన్‌లోని లార్డ్స్ స్టేడియం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇదివరకే బెర్త్‌ను ఖరారు చేసుకుంది దక్షిణాఫ్రికా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోయే జట్టుగా నిలిచింది ఆస్ట్రేలియా.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి ఒక్కో జట్టుకు. మ్యాచ్ టై అయితే- 6, డ్రా అయితే- 4 పాయింట్లు అందుతాయి. పాయింట్ల పర్సంటేజీ ఆధారంగా చేసుకుని ర్యాంకులను నిర్ధారిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.
ఇప్పటివరకు 17 మ్యాచ్‌లను ఆడింది ఆస్ట్రేలియా. నాలుగింట్లో మాత్రమే ఓడింది. రెండు డ్రా అయ్యాయి. 130 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. దీని ఆధారంగా ఆ జట్టుకు ఉన్న పర్సంటేజీ 63.73. దీనితో ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ పాయింట్లు గానీ, పర్సంటేజీ గానీ పెంచుకోవడానికి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఉపయోగపడింది.












Click it and Unblock the Notifications