టీమిండియాకు తీపి కబురు..!!
IND vs AUS: ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ గెలిచిన ఊపులో ఉంది భారత జట్టు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కంగారూలను ఠారెత్తించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజ వేసింది.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో కనపర్చిన దూకుడును రెండో గేమ్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో కూడా గెలిస్తే- దాదాపుగా ఈ ట్రోఫీపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టవుతుంది. డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్‌లో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఇది డే/నైట్ మ్యాచ్.

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు తీపి కబురు అందింది. ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఆడట్లేదు. పక్కటెముకల్లో నొప్పితో అతను బాధపడుతున్నాడు. ఈ కారణంగా రెండో టెస్ట్ నుంచి అతన్ని తప్పించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అతను జట్టుతోనే ఉన్నాడని, అడిలైడ్‌కు వెళ్లాడనీ తెలిపింది.
తొలి టెస్ట్ మ్యాచ్‌తో అయిదు వికెట్లు పడగొట్టాడు హేజిల్‌వుడ్. తొలి ఇన్నింగ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. 150 పరుగులకే జట్టు ఆలౌట్ అయిందంటే దానికి ప్రధాన కారకుడు హేజిల్‌వుడ్. ఆ ఇన్నింగ్‌లో మొత్తం నాలుగు వికెట్లను నేలకూల్చాడు. పతనాన్ని శాసించాడు. అలాంటి బౌలర్.. రెండో టెస్ట్‌కు దూరం కావడం టీమిండియాకు ఊపిరి పీల్చుకున్నట్టయింది.
హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, బ్రెండన్ డొగ్గెట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో చేర్చింది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ట్రావెల్ రిజర్వ్‌గా ఉంటోన్నారు. హేజిల్‌వుడ్ గాయంతో వైదొలగాల్సి రావడంతో ఈ ఇద్దరినీ జట్టులోకి తీసుకుంది. ఇద్దరిలో సీన్ అబాట్‌కు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టులో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications