విశాఖలో అడుగుపెట్టిన రోహిత్ సేన
India vs England 2nd test: ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను దారుణంగా ఆరంభించింది టీమిండియా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంకో రోజు ఆట మిగిలి వుండగానే పరాజయాన్ని చవి చూసింది. 0-1 తేడాతో వెనుకంజ వేసింది.
తొలి ఇన్నింగ్‌లో భారీ స్కోర్ సాధించి.. పట్టు బిగించినప్పటికీ.. దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది భారత్. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటు దెబ్బకొట్టింది. గెలవడానికి కావాల్సిన 230 పరుగులను కూడా అందుకోలేక చతికిలపడింది. 202 వద్దే ఆలౌట్ అయింది.

ఈ పరాజయానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. రెండో టెస్ట్ కోసం సన్నద్ధమౌతోంది. ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నంలో షెడ్యూల్ అయిందీ మ్యాచ్. పీఎం పాలెంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి- ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.
ఈ పోరు కోసం రెండు జట్లూ కొద్దిసేపటి కిందటే విశాఖపట్నానికి చేరుకున్నాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, లోకల్ బాయ్ కోన శ్రీకర్ భరత్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇంగ్లాండ్ కేప్టెన్ బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో.. ఇతర ప్లేయర్లు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ రెండు జట్లు ప్లేయర్లు బుధవారం నుంచి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడట్లేదు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ.. తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. రవీంద్ర జడేజా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీతో బాధపడుతున్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేఎల్ రాహుల్ కూడా రూల్డ్ అవుట్ అయ్యాడు.
మార్పులు చేర్పుల తరువాత కొత్త జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కేప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ ఉన్నారు.












Click it and Unblock the Notifications