మెగాస్టార్‌తో టీమిండియా బ్యాటింగ్ స్టార్.. కానుకగా
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. పద్మ విభూషణ్ అవార్డుకు నామినేట్ అయిన నేపథ్యంలో ఆయన ఇంటికి సందర్శకుల తాకిడి పెరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను అభినందిస్తోన్నారు. శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, పలువురు టెక్నీషియన్ల రాకపోకలతో చిరంజీవి నివాసం రద్దీగా మారింది.
చిరంజీవిని కలిసి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో నటుడు బ్రహ్మాజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట, మారుతి, స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, ఎస్ రాధాకృష్ణ (చినబాబు), శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి.. తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది.
కాగా- తాజాగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్.. మెగాస్టార్‌ను కలిశారు. ఈ మధ్యాహ్నం ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. టెస్ట్ మ్యాచ్‌లల్లో తాను ధరించే జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారు. విశాఖపట్నానికి చెందిన కేఎస్ భరత్.. చిరంజీవికి పెద్ద ఫ్యాన్.
ప్రస్తుతం అతను టీమిండియాతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోన్నాడు. ఇంగ్లాండ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌ను భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంకో రోజు ఆట మిగిలి వుండగానే పరాజయాన్ని చవి చూసింది. అయిదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజ వేసింది.
ఈ మ్యాచ్‌లో శ్రీకర్ భరత్ వ్యక్తిగత ఆటతీరు ఫర్వాలేదనిపించింది. మ్యాచ్ మొత్తంలో నాలుగు క్యాచ్‌లు పట్టాడు. 69 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్‌లో బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్ క్యాచ్‌లను అద్భుతంగా అందుకున్నాడు. ఈ ఇన్నింగ్‌లో 41 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్‌లో రేహాన్ అహ్మద్, మార్క్‌వుడ్ ఇచ్చిన క్యాచ్ అందుకుని వారిని పెవిలియన్ దారి పట్టించాడు. ఈ ఇన్నింగ్‌లో 28 పరుగులు చేశాడు. ఇక తన హోమ్ పిచ్‌పై రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమౌతున్నాడు.












Click it and Unblock the Notifications